జిల్లా రైతులకు చంద్రబాబు తీవ్ర అన్యాయం
● కరువు జాబితాలో ఒక్క మండలాన్నీ చేర్చకపోవడం దారుణం
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి
అనంతపురం: కరువు మండలాల ప్రకటనలో జిల్లా రైతులకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. మంగళవారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. జిల్లాలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 8.50 లక్షల ఎకరాలు ఉంటే ఈ ఖరీఫ్‌లో 7.50 లక్షల ఎకరాల్లో సాగు చేశారని తెలిపారు. వేరుశనగ సాధారణ సాగు 4.70 లక్షల ఎకరాలు కాగా, కేవలం 2.25 లక్షల ఎకరాల్లోనే సాగైందన్నారు. అధికారులు విడుదల చేసిన జాబితా ప్రకారం జిల్లాలో 7 మండలాల్లో తీవ్ర వర్షాభావం, 17 మండలాల్లో వర్షాభావం, 7 చోట్ల సాధారణ వర్షపాతం నమోదైందన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే ఖరీఫ్‌లో సాధారణ వర్షపాతంగా ప్రభుత్వానికి నివేదిక పంపి రైతాంగాన్ని నట్టేట ముంచారని మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లాలో 25 మండలాలను కరువు జాబితాలో చేర్చి పక్కనే ఉన్న అనంతపురం జిల్లాలో ఒక్క మండలాన్ని కూడా ప్రకటించలేదని దుయ్యబట్టారు.
అన్నదాతలు వలస వెళ్లాలా?
కరువు జాబితాలో చేరిస్తే క్రాప్ ఇన్సూరెన్స్ వస్తుందని, అదీ కాకపోతే ఇన్‌పుట్ సబ్సిడీ తప్పనిసరిగా అందుతుందని చెప్పారు. ఉపాధి పనులు కూడా అధికంగా కల్పిస్తారని, దీంతో రైతాంగానికి కొంతైనా చేయూత దక్కేదన్నారు. జిల్లాలో కేవలం వేరుశనగ పంట పైనే రైతులు రూ.450 కోట్ల నుంచి రూ.480 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారన్నారు. అననుకూల వర్షాలు, చీడపీడల దాటికి పంట తుడిచిపెట్టుకుపోవడంతో తీవ్రంగా నష్టపోయారన్నారు. జిల్లాలో చాలామంది ప్రజాప్రతినిధులు రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారేనని, అలాంటి వారే రైతుల గురించి పట్టించుకోక పోతే ఎలా అని ప్రశ్నించారు. రబీ సీజన్‌కు సంబంధించి సబ్సిడీపై పప్పుశనగ విత్తనం పంపిణీలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ధ్వజమెత్తారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలోనే అత్యధికంగా పప్పుశనగ సాగు చేస్తారని, అక్కడా పప్పుశనగ పంపిణీ చేయని దారుణ పరిస్థితులు నెలకొన్నా యన్నారు. ‘‘గతంలో బెంగళూరు, హైదరాబాద్, ముంబై తదితర నగరాలకు రైతులు వలస పోవడాన్ని చూశాం. సాగు కలిసిరాక తనువులు చాలించిన వారిని చూశాం. ఇప్పుడిప్పుడే కుదుటపడుతుంటే మళ్లీ గత పరిస్థితులు తెస్తారా’’ అని అనంత ఆవేదన వ్యక్తం చేశారు. పునఃసమీక్ష చేసి కరువు మండలాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
అవినీతి బురదలో కూరుకుపోయావు..
అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అవినీతి బురదలో కూరుకుపోయి దాన్ని అందరికీ అంటించాలని చూస్తున్నాడని ‘అనంత’ విమర్శించారు. ఇన్ని వివాదాలు, అవినీతి ఆరోపణలు మూటగట్టుకున్న వ్యక్తిని తాను ఎన్నడూ చూడలేదన్నారు. తాను బురదలో ఇరుక్కుని దాన్ని అందరికీ పూస్తే సరిపోతుందనే రీతిలో వెళ్తున్నాడన్నారు. అనంతపురంలో కృష్ణ ఇంగ్లిష్ మీడియం స్కూల్ యజమానినీ వదల్లేదనీ, బుడగ జంగాల వాళ్లను వదల్లేదనీ, సాయినగర్‌లో మైనార్టీ మహిళను ఎలా దూషించారో అందరికీ తెలుసన్నారు. చివరకు చంద్రబాబు బావమరిది, హరికృష్ణ కుమారుడైన జూనియర్ ఎన్టీఆర్‌ను, ఆయన తల్లిని ఎలా దూషించారో అందరూ విన్నారన్నారు.పాపంపేటలో ఏం జరిగిందో అందరికీ తెలుసని, చివరకు దొంగ సంతకాలు చేశారని చెబుతున్నారని దుయ్యబట్టారు. ‘మా కుటుంబ చరిత్ర తెరిచిన పుస్తకం. ముగ్గురు అన్నదమ్ములం కలిసే ఉన్నాం. ఒక్కొక్కరికి 30 ఎకరాలు కూడా రావు. ప్రభుత్వం మీదే.. ఒక వేళ మేము చట్ట వ్యతిరేకంగా సంపాదించి ఉంటే బయటపెట్టండి’ అని పేర్కొన్నారు. తనకు కృష్ణా జలాల గురించి తెలుసు, తుంగభద్ర జలాల గురించీ తెలుసని, కానీ దగ్గుపాటి తీసుకునే జలం గురించి మాత్రం తెలియదని ఎద్దేవా చేశారు. ప్రజలకు సేవ చేసే భాగ్యం కొందరికే వస్తుందని, వీలైతే అభివృద్ధి చేయాలని హితవు పలికారు. కార్యక్రమంలో పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నారాయణ రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు, నగర అధ్యక్షుడు పసలూరి ఓబులేసు, శ్రీనివాసులు పాల్గొన్నారు.


