రెవెన్యూ క్రీడలను విజయవంతం చేయాలి
● కలెక్టర్ ఆనంద్
అనంతపురం కార్పొరేషన్: జిల్లా కేంద్రంలో ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి 7వ రెవెన్యూ క్రీడలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక ఆర్‌డీటీ స్టేడియంలో అధికారులతో ఆయన సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ క్రీడాకారులకు వసతి ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలన్నారు. తాగునీరు, భోజన సౌకర్యాలు, నిరంతర విద్యుత్ సరఫరా, పారిశుధ్య పనులు, ప్రొటోకాల్, పోలీసు భద్రత, ట్రాఫిక్ మళ్లింపులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి బస్సు సౌకర్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు, ఫిజియోథెరపిస్టులను ఏర్పాటు చేయాలన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, సీసీఎల్‌ఏ జయలక్ష్మిని కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిపారు. అనంతరం ఆయన మైదానాలు, వసతి గృహాలను పరిశీలించారు. కలెక్టర్ వెంట జేసీ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్‌ఓ మలోల, ఎస్‌ఎస్‌ఓ రామకృష్ణా రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వెంకటరాజేష్, జిల్లా అధ్యక్షుడు దివాకర్ రావు, ప్రధాన కార్యదర్శి సోమశేఖర్, శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు మధునాయక్ పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయంతోనే మనుగడ
అనంతపురం అగ్రికల్చర్: ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని, భవిష్యత్తులో మానవాళి మనుగడ సాగించాలంటే ఈ తరహా వ్యవసాయం విస్తరించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. మంగళవారం స్థానిక జెడ్‌బీఎన్‌ఎఫ్ కార్యాలయంలో మహిళా స్వయం సహాయక బృంద సభ్యులకు నిర్వహిస్తున్న శిక్షణలో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించడానికి చర్యలు తీసుకుంటా మన్నారు. జేడీఏ ఉమామహేశ్వరమ్మ, డీపీఎం లక్ష్మానాయక్, మేనేజర్ నరేంద్రకుమార్ పాల్గొన్నారు.


