నిపుణులు లేకుండా విజ్ఞానం ఎలా?
అనంతపురం సిటీ: విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి, అవగాహన పెంపొందించి, వారి మానసిక వికాసానికి దోహదపడేలా విద్యా శాఖ విజ్ఞాన యాత్రకు ప్రణాళిక రచిస్తోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వేల మందిని దశల వారీగా విజ్ఞాన యాత్రలో భాగస్వాములను చేయాలని సంకల్పించింది. ప్రతి మండలం నుంచి 10 మంది చొప్పున జిల్లాలోని 729 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి కనీసం 50 వేల మందికి తగ్గకుండా విజ్ఞాన యాత్రకు వచ్చి ప్రాజెక్టులు పరిశీలించి, విజ్ఞానం పెంచుకునేలా చూడాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. సైన్స్ సెంటర్‌కు అవసరమైన నిధుల కోసం సమగ్రశిక్ష ప్రాజెక్ట్ రాష్ట్ర డైరెక్టర్ శ్రీనివాసరావుతో కలెక్టర్ ఫోన్‌లో మాట్లాడి ఆయన అంగీకరించేలా చొరవ తీసుకున్నారు. ఈ క్రమంలో విజ్ఞాన యాత్ర ఈ నెల 10 నుంచి ప్రారంభించాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు.
అవగాహన కల్పించేవారేరీ..?
విజ్ఞాన యాత్రలో భాగంగా అనంతపురంలోని సైన్స్ సెంటర్, కలెక్టరేట్, ఆకాశవాణి రేడియో స్టేషన్, పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని మ్యూజియంను విద్యార్థులు సందర్శించాల్సి ఉంటుంది. ఇక్కడి దాకా అంతా బాగున్నా సైన్స్ సెంటర్‌లో నిపుణులు లేకపోవడమే సమస్యగా మారింది. ప్రాజెక్టుల గురించి విశదీకరించేందుకు ఎవరూ లేకపోవడంతో అసలు విద్యార్థులకు విజ్ఞానం ఎలా పెంపొందుతుందనే ప్రశ్న ఉపాధ్యాయ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.
8, 9 ,10 తరగతుల విద్యార్థుల విజ్ఞాన యాత్రకు విద్యా శాఖ ప్రణాళిక
సైన్స్ సెంటర్‌లో
అందుబాటులో లేని నిపుణులు
విద్యార్థులకు విజ్ఞానం ఎలా పెంపొందుతుందనే ప్రశ్నలు


