
ముగిసిన జోనల్ స్థాయి క్రీడా పోటీలు
పామిడి: రెండు రోజులుగా పామిడి వేదికగా సాగుతున్న ఏపీ విద్యాభారతి జోనల్ స్థాయి క్రీడాపోటీలు ఆదివారం ముగిశాయి. ఉమ్మడి అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల నుంచి 350 మంది బాలురు, 250 మంది బాలికలు హాజరయ్యారు. అండర్–13, 15 విభాగాలల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, రన్నింగ్ రేస్, లాంగ్‌జంప్, హైజంప్, యోగా, చదరంగం వంటి క్రీడా పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి మెడల్స్‌తో పాటు ప్రశంసాపత్రాలను అందజేశారు. కాగా, పోటీల ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను ఉమ్మడి అనంతపురం జిల్లా క్రీడాకారులు దక్కించుకున్నారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా పారిశ్రామికవేత్త రాంప్రసాద్, ప్రముఖులు రాఘవయ్య, సునీల్‌కుమార్, చౌడయ్య, హెచ్‌ఎంలు శ్రీనివాసన్, మయూరి, ఆచార్య బృందం పాల్గొన్నారు.
‘ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికల్లో
పారదర్శకత పాటించాలి’
కుందుర్పి: ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రదానానికి సంబంధించి అర్హుల ఎంపికలో పారదర్శకత పాటించాలని ఏపీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయభాస్కర్ డిమాండ్ చేశారు. ఆదివారం కుందుర్పిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉత్తమ అవార్డుల ఎంపిక కోసం ఉపాధ్యాయులే దరఖాస్తులు చేసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అసోసియేషన్ వ్యతిరేకిస్తోందన్నారు. కాగా, ఎంతో మంది నిబద్ధతతో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తమకు అవార్డులు ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో మార్పు చేయాలని కోరారు. రాజకీయ ప్రాబల్యమున్న వారికే అవార్డులు ఇస్తారనే భానవ ఇప్పటికే చాలా మందిలో పాతుకపోయిందన్నారు. అలా కాకుండా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ప్రభుత్వం ప్రత్యేక కమిటీలు నియమించి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేపట్టి నీతి, నిబద్దతతో పనిచేస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి, అవార్డులు అందజేయాలని డిమాండ్ చేశారు.
అలరించిన సంగీత కచేరీ
ప్రశాంతి నిలయం: సత్యసాయిని కీర్తిస్తూ బాలవికాస్ చిన్నారులు నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను అలరించింది. పర్తి యాత్రలో భాగంగా పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి విచ్చేసిన తెలంగాణ సత్యసాయి భక్తులు ఆదివారం సాయికుల్వంత్ సభా మందిరంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సత్యసాయిని కీర్తిస్తూ బాలవికాస్ చిన్నారులు నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను మంత్రముగ్ధులను చేసింది.
యువకుడి దుర్మరణం
● మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
గోరంట్ల: ట్యాంకర్‌ను ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడు దుర్మరణం పాలు కాగా, మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. గోరంట్ల మండలం బూదిలివాండ్లపల్లి గ్రామానికి చెందిన మహేంద్ర (26), శ్రీనివాసులు, కార్తీక్ ఆదివారం వ్యక్తిగత పనిపై గోరంట్లకు వచ్చారు. పని ముగించుకుని ఒకే ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన వారు రెడ్డిచెరువుకట్ట సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా ప్రధాన రహదారిపై వస్తున్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొన్నారు. ఘటనలో మహేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాసులు, కార్తీక్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హిందూపురంలోని జిల్లాస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శేఖర్ తెలిపారు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై
చిన్నాన్న దాడి
ధర్మవరం అర్బన్: స్థానిక గుట్టకిందపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రఘునాథరెడ్డిపై అతని చిన్నాన్న పుల్లారెడ్డి పారతో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయమైంది. పోలీసులు తెలిపిన మేరకు.. ఆదివారం రఘునాథరెడ్డి ఇంటి వద్ద ఉన్న పశువుల కొట్టంలోని నిల్వ ఉన్న వర్షపు నీరు ఆ పక్కనే ఉన్న చిన్నాన్న పశువుల కొట్టంలోకి వెళుతున్నాయి. ఈ విషయంగా రఘునాథ్‌రెడ్డి తల్లి పద్మావతితో పుల్లారెడ్డి వాగ్వాదానికి దిగాడు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న రఘునాథరెడ్డి.. చిన్న విషయాలకు గొడవలు ఎందుకని తల్లి పద్మావతిని ఇంట్లోకి పిలుచుకెళుతుండగా పుల్లారెడ్డి దుర్భాషలాడుతూ పారతో రఘునాథరెడ్డిపై దాడి చేశాడు. తలకు తీవ్ర గాయమైన రఘునాథరెడ్డిని కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు ధర్మవరం రెండో పట్టణ సీఐ రెడ్డప్ప తెలిపారు.

ముగిసిన జోనల్ స్థాయి క్రీడా పోటీలు

ముగిసిన జోనల్ స్థాయి క్రీడా పోటీలు