శాస్త్రోక్తంగా ధ్వజారోహణం
ఉరవకొండ రూరల్: మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలకు శనివారం అంకుర్పారణ గావించారు. ముందుగా శాస్త్రోక్తంగా ధ్వజారో హణం నిర్వహించారు. ఉదయం స్వామి వారికి విశేష పూజలు, అభిషేకాలు చేపట్టారు. అనంతరం బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజ స్తంభం వద్ద ఆలయ ఈఓ సాకే రమేష్ బాబు, ప్రధాన అర్చకులు ద్వారకానాథచార్యులు, బాలాజీస్వామి ప్రత్యేక పూజలు చేశారు.
నేడు నృసింహుని జయంతి..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం లక్ష్మీ నృసింహస్వామి జయంతి నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామి వారు సింహ, చంద్ర ప్రభ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ ఈఓ రమేష్‌బాబు తెలిపారు.
బాలికతో శ్రీవారి నిశ్చితార్థం
రాయదుర్గంటౌన్: పట్టణంలోని కోటలో వెలసిన ప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 20వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు శనివారం స్వామి వారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి పట్టణంలోని మార్కండేయస్వామి ఆలయంలో కంకణధారణ జరిగింది. వందేళ్ల నుంచి వస్తున్న విశిష్ట సంప్రదాయంలో భాగంగా పద్మశాలియ అరవ తెగకు చెందిన బాలికతో శ్రీవారి వివాహ మహోత్సవం(ఈ నెల 15న) జరిపించేందుకు నిశ్చితార్థం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ ఏడాది పట్టణానికి చెందిన అరవా శ్రీనివాసులు, శ్వేత దంపతుల కుమార్తె శ్రీధన్యతో శ్రీవారి కల్యాణం జరగనుంది. శ్రీవారి తరఫున బ్రాహ్మణులు, పుర పెద్దలు, దేవదాయశాఖ అధికారులు, పెళ్లికుమార్తె తరఫున బాలిక తల్లిదండ్రులు, బంధువులు, పద్మశాలీయ కులస్తులు తాంబులాలను ఇచ్చిపుచ్చుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ధ్వజారోహణ, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ట, సాయంత్రం శ్రీవారి సింహవాహనోత్సవం జరుగుతుందని ఈఓ నరసింహారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పద్మశాలీయ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు అరవా శివప్ప, చుంచుల నాగప్ప, మున్సిపల్‌చైర్‌పర్సన్ పొరాళ్ల శిల్ప, గౌని ఉపేంద్రరెడ్డి, పొరాళ్ల శివకుమార్, గాజుల వెంకటేశులు, బంగి శంకర్ పాల్గొన్నారు.
శాస్త్రోక్తంగా ధ్వజారోహణం


