నర్సీపట్నం: నర్సీపట్నం డివిజన్ డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న పి.శ్రీనివాసరావు సాహాసేతమైన నిర్ణయం తీసుకున్నారు. మరణించిన తరువాత కూడా తాను జీవించి ఉండాలని అవయవదానం చేసేందుకు అంగీకార పత్రాన్ని అందజేసి ఆదర్శంగా నిలిచారు. డీఎస్పీ నిర్ణయాన్ని అఖిలభారత శరీర, అవయవ దాతల సంఘం వ్యవస్థాపక అధ్యక్షరాలు డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి కొనియాడారు. అవయవదానంపై బుధవారం నర్సీపట్నంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సులో ఆయన అవయవదానం చేస్తున్నట్టు అంగీకార పత్రాన్ని సీతామహాలక్ష్మికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవయవదానం చేసేందుకు తనలాగే ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. మనం బతికి ఉన్నప్పుడే కాకుండా మనం మరణించిన తర్వాత కూడా మన అవయవాలు వేరొకరు శరీరంలో అమర్చడం ద్వారా మనం సజీవంగా ఉన్నట్లే అన్నారు. డీఎస్పీతో పాటు విలేకరి బేరా చినబాబు, కాగుపాటి జ్యోతి, గన్నవరపు వెంకట సుబ్బారావు, శారదాదేవి దంపతులు, వాకర్‌క్లబ్ సెక్రటరీ మాకిరెడ్డి సత్యనారాయణ, రిటైర్డ్ టీచర్ ఆళ్ల వరప్రసాద్, రిటైర్డ్ ఎంఈవో నాగేశ్వరరావు అవయవదానం చేసేందుకు అంగీకార పత్రాలను అందజేశారు.


