ఎస్సీల సమస్యలపై నిర్లక్ష్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

ఎస్సీల సమస్యలపై నిర్లక్ష్యం వద్దు

Sep 17 2026 12:26 AM | Updated on Sep 17 2026 12:26 AM

ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కె.ఎస్‌. జవహర్‌

తుమ్మపాల : దళితుల సమస్యల పరిష్కారంపై దిగువ స్థాయి అధికారులు నిర్లక్ష్యం కారణంగానే ఎస్సీ కమిషన్‌ దృష్టికి అనేక సమస్యలు వస్తున్నాయని ఏపీ ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కె.ఎస్‌. జవహర్‌ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్‌లో బుధవారం సాయంత్రం కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ తుహిన్‌ సిన్హా ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. 1989 చట్టం ప్రకారం కమిషన్‌కు ఉన్న అధికారాలు, పరిమితుల దృష్ట్యా అక్రమాలు, ల్యాండ్‌ గ్రాబింగ్‌, అట్రాసిటీ రహిత సమాజాన్ని నిర్మించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. రేపు చేయాల్సిన పని ఈరోజే చేయాలి, ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే చేయాలి‘ అనే నానుడిని గుర్తు చేస్తూ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని స్పష్టం చేశారు. సమస్యలతో తమ వద్దకు వచ్చే ఎస్సీ వర్గాల ప్రజలను ఆప్యాయంగా కూర్చోబెట్టి వారి బాధలను ఓపిగ్గా వినాలని సూచించారు. సమాజంలో వెనుకబడిన వారిని మనం దూరం పెట్టడం వల్ల వారు మరింత కుంగిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో అట్రాసిటీలు, వివక్ష పూర్తిగా అంతరించలేదని, అవి కొత్త రూపాలు మార్చుకుని కొనసాగుతున్నాయని చెప్పారు. గతంలో రెండు, మూడు గ్లాసుల పద్ధతి ఉండేదని, ఇటీవల సంతనూతలపాడు, శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లో పర్యటించినప్పుడు సైతం ఇటువంటి పరోక్ష వివక్ష సంఘటనలు తమ దృష్టికి వచ్చాయని ఉదహరించారు. బాధితులకు కేవలం చట్టపరమైన న్యాయమే కాకుండా, వారికి ఆర్థిక సాధికారత , ఉపాధి కల్పిస్తేనే వారి జీవితాలు సజావుగా, ఆరోగ్యకరంగా ఉంటాయన్నారు. ఎస్సీ వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యావకాశాలను మెరుగుపరచడం, ఆర్థిక సాధికారత సాధించేందుకు మెరుగైన ఉపాధి మార్గాలను పెంపొందించడం, చదువు, ఉపాధి ప్రాతిపదికన సమాజంలో సామాజిక సమానత్వాన్ని తీసుకురావడం, ప్రభుత్వ అధికారులు సమాజ మార్పులో ప్రధాన పాత్ర పోషించాలని, ఇది మంచి ఫలితాలను ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇతర జిల్లాలతో పోలిస్తే అనకాపల్లి జిల్లాలో కేసులు తక్కువగా ఉన్నాయని, జిల్లాను అట్రాసిటీ ఫ్రీజోన్‌గా ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపేందుకు అధికారులందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కమిషన్‌ సెక్రటరీ ఎస్‌.చిన్న రాముడు, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రామానందం, కమిషన్‌ సభ్యుడు రావాడ సీతారాం, ఎస్సీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సత్య పద్మ, జిల్లా వివిధ శాఖల అధికారులు, పోలీస్‌ అధికారులు పాల్గొ0న్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement