రూ.80 కోట్ల విలువైన
భీమలింగేశ్వరుడి భూములకు ఎసరు
హైవేను ఆనుకుని ఉండడంతో
ఎకరం సుమారు రూ.8 కోట్లు
గతంలో ఆక్రమణలు తొలగించిన
ఎండోమెంట్ అధికారులు
భూముల పరిరక్షణకు వేలంకు సిద్ధమైతే
కోర్టును ఆశ్రయించిన ఆక్రమణదారులు
భూములన్నీ దేవస్థానానివేనని తేల్చిన
న్యాయస్థానం
కూటమి నేతల అండపై
స్థానికుల ఆరోపణలు
ఇరువాడలో వాలిన
తీర్పు తర్వాతా ఆక్రమణలు
సబ్బవరం: సనాతన ధర్మం, దేవాలయాల పరిరక్షణ, హిందూ ధర్మ రక్షణ అంటూ రాజకీయ వేదికలపై పెద్దెత్తున మాట్లాడే కూటమి నేతలు.. అదే దేవుడి భూముల పరిరక్షణ విషయంలో మాత్రం ఎందుకు మౌనం వహిస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సబ్బవరం మండలం ఇరువాడలోని భీమలింగేశ్వరస్వామి ఆలయానికి చెందిన కోట్లాది రూపాయులు విలువైన భూములపై కొంత మంది కూటమి నేతలే కన్నేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి అండదండలతోనే ఆక్రమణలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తుండగా.. అడ్డుకోవాల్సిన రెవెన్యూ, దేవదాయ శాఖల అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రూ.80 కోట్ల ఆస్తికి ఎసరు
భీమలింగేశ్వరస్వామి ఆలయానికి వివిధ సర్వే నెంబర్లలో రికార్డుల ప్రకారం సుమారు 10.19 ఎకరాలు ఉన్నాయి. ముఖ్యంగా 33/1, 33/2 సర్వే నెంబర్లలో 9.85 ఎకరాలు గ్రామానికి, జాతీయ రహదారికి ఆనుకుని ఉండడంతో భారీ ధర పలుకుతోంది. ఎకరం రూ.7 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకూ విలువ ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ లెక్కన భూముల విలువ సుమారు రూ.80 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.
గతంలో ఆక్రమణల తొలగింపు
దేవస్థానం భూముల్లో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఫిర్యాదులు అందడంతో అప్పటి దేవదాయ శాఖాధికారులు చర్యలు చేపట్టారు. అసిస్టెంట్ కమిషనర్ శాంతి, తదితర అధికారులు స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి ఆక్రమణలు తొలగించి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. భూములను సమగ్రంగా సర్వే చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ఫలం సాయానికి ఇచ్చేలా వేలం ద్వారా పరిరక్షించే దిశగా అధికారులు సన్నాహాలు చేశారు.
వేలంను అడ్డుకునేందుకు కోర్టు బాట
దేవస్థానం భూములను వేలం వేసే ప్రక్రియ ముందుకు సాగుతున్న సమయంలో అప్పటికే ఆక్రమణలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు కూటమి నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అలా ఆ ప్రక్రియను అడ్డుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ వివాదంపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో సదరు భూములన్నీ భీమలింగేశ్వరస్వామి దేవస్థానానికే చెందినవని స్పష్టం చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
హైవే నుంచి గ్రామానికి వేసిన
రోడ్డు తొలగింపు
గత ప్రభుత్వంలో జాతీయ రహదారిని ఆనుకుని గ్రామ అవసరాల కోసం ఎన్‌హెచ్–16 అధికారులు ఏర్పాటు చేసిన రహదారిని కొందరు కూటమి నేతలు పొక్లెయిన్లతో తొలగించి ట్రాక్టర్లతో మట్టిని ఆ ప్రాంతంలోని దేవస్థానం భూముల్లో ఫిల్లింగ్ చేయించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అదే ప్రాంతంతో రేకుల షెడ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని చెబుతున్నారు. గ్రామ ప్రజల అవసరాల కోసం ఉన్న రహదారిని తొలగించి దేవస్థానం భూమిలో ఫిల్లింగ్ చేయడానికి ఎవరు అనుమతులు ఇచ్చారు.?, నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదు.? అనే ప్రశ్నలు ఇప్పడు అందరిలో తలెత్తుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి కోట్ల విలువైన భీమలింగేశ్వరుడి స్వామి ఆలయ భూములను కాపాడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
ఫిర్యాదులు వస్తే దేవదాయ శాఖకు పంపిస్తాం..
దేవస్థానం భూముల పరిరక్షణ అంశం పూర్తిగా దేవదాయ శాఖ పరిధిలో ఉంటుంది. ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు అందితే దేవదాయ శాఖ అధికారులకు సమాచారం ఇస్తాం. ఆక్రమణల తొలగింపు, భూముల సర్వే, దేవస్థానానికి అప్పగించే ప్రక్రియలో రెవెన్యూ శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తాం.
– అరుణ్ చంద్ర, తహసీల్దార్, సబ్బవరం మండలం
కోర్టు తీర్పుతో భూములపై హక్కులు స్పష్టమైనప్పటికీ వాటిని పూర్తిగా దేవస్థానం ఆధీనంలోకి తీసుకుని రక్షణ కల్పించాల్సిన అధికారులు.. ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. దీంతో మళ్లీ ఆక్రమణలు మొదలయ్యాయని స్థానికులు చెబుతున్నారు. సర్వే నెంబర్ 33/1లో మట్టి ఫిల్లింగ్ చేయడంతో పాటు రేకుల షెడ్లు నిర్మించి పశువుల పెంపకం చేపడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.


