చెదలు పట్టాయని.. రోడ్డుపై నోట్లు పారేశాడు! | - | Sakshi
Sakshi News home page

చెదలు పట్టాయని.. రోడ్డుపై నోట్లు పారేశాడు!

Sep 17 2026 12:26 AM | Updated on Sep 17 2026 12:26 AM

● విశాఖలో చిరిగిన కరెన్సీ నోట్ల కలకలం ● పోలీసుల దర్యాప్తుతో వీడిన మిస్టరీ ● రూ.3 వేల విలువైన నోట్లు.. ఎల్‌ఐసీ రసీదులు, పాన్‌కార్డు

అల్లిపురం (విశాఖ): నగరంలో రోడ్డుపై పెద్ద సంఖ్యలో చిరిగిన కరెన్సీ నోట్లు కనిపించడంతో కలకలం రేగింది. సెంట్రల్‌ పార్క్‌ ఎదురుగా బుధవారం తెల్లవారుజామున వాకర్స్‌ వీటిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో టూటౌన్‌ పోలీసులు అక్కడికి చేరుకుని నోట్లను స్వాధీనం చేసుకున్నారు. సీఐ అప్పలనాయుడు ఆధ్వర్యంలో పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. విచారణలో కేజీహెచ్‌ ప్రాంతంలోని తాడివీధికి చెందిన ఆదిమూలం సూర్యారావు నోట్లను అక్కడ పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆయనను పిలిపించి విచారించగా.. తాను కిరాణా దుకాణాలకు సరుకులు సరఫరా చేస్తుంటానని తెలిపాడు. కొంతకాలంగా ఇంట్లోని అట్టపెట్టెలో నగదుతోపాటు ఎల్‌ఐసీ రసీదులు ఉంచినట్లు చెప్పాడు. వాటికి చెదలు పట్టడంతో.. కుటుంబ సభ్యులకు తెలిస్తే వివాదం తలెత్తుతుందనే ఉద్దేశంతో మంగళవారం సాయంత్రం చిరిగిన నోట్లను సెంట్రల్‌ పార్క్‌ ఎదురుగా రోడ్డుపై పడేసినట్లు సీఐ అప్పలనాయుడు తెలిపారు. చిరిగిన నోట్ల విలువ సుమారు రూ.3 వేల వరకు ఉంటుందని సూర్యారావు చెప్పాడు. అవి వినియోగానికి పనికిరావని భావించి రోడ్డుపై పడేసినట్లు వివరించాడు. దీంతో నోట్లతోపాటు అక్కడ లభించిన ఎల్‌ఐసీ రసీదులు, పాన్‌కార్డును పోలీసులు బుధవారం మధ్యాహ్నం సూర్యారావుకు అందజేశారు. పోలీసుల దర్యాప్తుతో రోడ్డుపై చిరిగిన నోట్లు ప్రత్యక్షమైన ఘటన వెనుక మిస్టరీ వీడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement