కొత్త మీటర్లు లేవండీ! | - | Sakshi
Sakshi News home page

కొత్త మీటర్లు లేవండీ!

Sep 17 2026 12:20 AM | Updated on Sep 17 2026 12:20 AM

ఈపీడీసీఎల్‌లో విద్యుత్‌ మీటర్ల కొరత

కొత్త కనెక్షన్లకూ, కాలిపోయిన వాటికీ పాత మీటర్లే దిక్కు

కొత్త మీటర్‌కు వసూలు చేస్తున్నట్లుగానే చార్జీలు

స్మార్ట్‌ మీటర్ల కోసం తెరవెనుక ఒత్తిళ్లు?

సాక్షి, విశాఖపట్నం: ఈపీడీసీఎల్‌ పరిధిలో నెల రోజులుగా కొత్త విద్యుత్‌ మీటర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కొత్తగా ఇళ్లు నిర్మించుకుని విద్యుత్‌ కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మీటర్లు అందుబాటులో లేక ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని ప్రాంతాల్లో కనెక్షన్‌ మంజూరైనా మీటర్‌ బిగించకపోవడంతో గృహ ప్రవేశాలు చేసిన వారు విద్యుత్‌ కోసం ఇరుగుపొరుగు ఇళ్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరోవైపు హైఓల్టేజ్‌, షార్ట్‌సర్క్యూట్‌, ఇతర కారణాలతో మీటర్లు కాలిపోయినా వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం లేదు. పాడైన మీటర్లను తొలగించి పాత మీటర్లనే మరమ్మతులు చేసి తిరిగి బిగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టాక్‌ లేదన్న కారణంతో సిబ్బంది జాప్యం చేస్తుండటంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు.

చలానా మాత్రం కొత్త దానికే..!

కొత్త మీటర్లు అందుబాటులో లేకపోవడంతో ఏళ్ల క్రితం వినియోగించి పక్కనపెట్టిన మీటర్లనే మరమ్మతులు చేసి ప్రస్తుతం బిగిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త కనెక్షన్లకే కాకుండా మీటర్లు కాలిపోయినా, పాడైపోయినా వాటి స్థానంలో వీటినే ఏర్పాటు చేస్తున్నారు. అయితే మీటర్‌ ఫీజు విషయంలో మాత్రం వినియోగదారులకు మినహాయింపు ఉండటం లేదు. కొత్త మీటర్‌కు ఎంత చెల్లించాలో అంతే మొత్తాన్ని చలానా రూపంలో వసూలు చేస్తున్నారు. కొత్త మీటర్‌ కోసం పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించి.. చివరకు పాత మీటర్‌ బిగించడంపై వినియోగదారులు మండిపడుతున్నారు. పాత మీటర్ల పనితీరు, కచ్చితత్వంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మీటర్‌ రీడింగ్‌లో లోపాలు తలెత్తితే విద్యుత్‌ బిల్లులు తారుమారయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.

స్మార్ట్‌ మీటర్ల వైపు మళ్లించేందుకేనా?

ఒకవైపు సాధారణ మీటర్ల కొరత నెలకొనడం.. మరోవైపు స్మార్ట్‌ మీటర్ల వైపు ప్రజలను మళ్లించేందుకు సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారన్న ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. కొత్త కనెక్షన్‌ కావాలంటే స్మార్ట్‌ మీటర్‌ ఏర్పాటు చేసుకోవాలని కొందరు సిబ్బంది వినియోగదారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. వాటికి సమ్మతించని వారికి పాత మీటర్లు బిగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్మార్ట్‌ మీటర్లతో విద్యుత్‌ బిల్లుల భారం పెరుగుతుందన్న ఆందోళనతో పాటు.. రీఛార్జ్‌ విధానంపై స్పష్టత లేకపోవడంతో పలువురు వినియోగదారులు వాటిపై ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో సాధారణ మీటర్ల కొరతకు కారణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంకా స్టాక్‌ రాలేదంట..?

కొత్త మీటర్ల కోసం ఇప్పటికే కేంద్ర కార్యాలయానికి ఇండెంట్‌ పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే పైస్థాయి నుంచి ఇంకా స్టాక్‌ సరఫరా కాలేదని స్థానిక సిబ్బంది పేర్కొంటున్నారు. మీటర్లు వచ్చే వరకు పాత వాటితోనే నెట్టుకురావాల్సి ఉంటుందని అనధికారికంగా స్పష్టం చేస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కొత్త మీటర్ల కొరతను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. లేదంటే కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారితో పాటు కాలిపోయిన, పాడైన మీటర్లను మార్చుకోవాల్సిన వినియోగదారుల ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement