ముగ్గురు సిబ్బందికి మెమో జారీ
గొలుగొండ: గురుకుల కళాశాలలో విద్యార్థులకు వడ్డించే భోజనం సరిగా లేకపోవడంతో ఇక్కడ పనిచేసే ముగ్గురు సిబ్బందికి ప్రిన్సిపాల్ విక్టరీపాల్ బుధవారం మెమో జారీ చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై మంగళవారం రాత్రి నర్సీపట్నం జనసేన ఇన్‌చార్జి రాజాన సూర్యచంద్ర, ఎంపీడీవో శ్రీనివాసరావు గురుకుల కళాశాలకు వెళ్లి భోజనం పరిశీలించారు. రాత్రి విద్యార్థులకు వడ్డించే భోజనం పూర్తిగా నాసిరకంగా ఉండడం, మెనూ ప్రకారం భోజనం తయారు చేయకపోవడంతో ఇక్కడ పనిచేసే సిబ్బంది, ప్రిన్సిపాల్‌పై విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు రాజాన సూర్యచంద్ర మండిపడ్డారు. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇక్కడ సిబ్బంది పనితీరు దారుణంగా ఉందని ఆరోపించారు. దీనిపై ప్రిన్సిపాల్ ముగ్గురు పనిచేసే సిబ్బందికి మెమో జారీ చేస్తూ ఇటువంటి తప్పు జరగకుండా చూస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు.


