కూటమి నేతల కనుసన్నల్లో తవ్వకాలు
● పట్టపగలే లారీల్లో యథేచ్ఛగా తరలింపు
● అధికారుల అండతోనే దందా
● బలహీనపడుతున్న కాలువ గట్లు
● ఆందోళనలో ప్రజలు
నక్కపల్లి: మట్టిమాఫియా బరితెగించింది. నియోజకవర్గంలో పోలవరం కాలువను గుల్ల చేస్తోంది. అడ్డూఅదుపు లేకుండా యథేచ్ఛగా తవ్వేసి తరలించుకుపోతోంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణపు పనులు 6,7 ప్యాకేజీల కింద చేపట్టారు. పాయకరావుపేట నుంచి యలమంచిలి నియోజకవర్గంలోని కొత్తలి వరకు ఈ పనులు నిర్వహిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో 2004లో పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణపు పనులు ప్రారంభమయ్యాయి. సుమారు 50 శాతం పైగానే పూర్తయ్యాయి. కాలువ తవ్వకాల్లో వచ్చిన మట్టిని గట్లుగా వేశారు. కోట్లాది క్యూబిక్ మీటర్ల మట్టి గట్లుగా పోయడంతో అక్రమార్కుల కళ్లు ఈ మట్టిపై పడ్డాయి.
నెలకు రూ.కోటి కొల్లగొట్టి..
సరైన పర్యవేక్షణ లేకపోవడంతో రేయింబవళ్లు పొక్లెయిన్లతో తవ్వేసి లారీల్లో తరలించుకుపోతున్నారు. ఇలా రోజుకు 50 నుంచి 70 టిప్పర్ల మట్టిని తరలిస్తున్నట్టు సమాచారం. టిప్పర్ మట్టి ధర రూ.4 వేలపైనే పలుకుతోంది. రోజుకు రూ.2 లక్షలు, నెలకు సుమారు రూ.కోటి వరకు వెనకేసుకుంటున్నారని భోగట్టా. నక్కపల్లి మండలం ముకుందరాజుపేట, రమణయ్యపేట, గుల్లిపాడు,సీతం పాలెం, ఎస్.రాయవరం మండలం రామయ్యపట్నం,పాయకరావుపేట మండలం పి.ఎల్.పురం, సీతారాంపురం తదితర గ్రామాల పరిధిలో ఉన్న కాలువ మట్టిని తరలిస్తున్నారు. సమీపంలో ఉన్న అనధికార లేఅవుట్లకు, నిర్మాణంలో ఉన్న ఇళ్ల పునాదులు, అపార్ట్‌మెంట్లకు, వివిధ గ్రామాల్లో నిర్మిస్తున్న రోడ్లు, అధికార ప్రైవేటు భవనాలకు వినియోగిస్తున్నారు. పాయకరావుపేట, నక్కపల్లి మండలాల్లో ఉన్న పలు కంపెనీలకు కూడా ఈ పోలవరం మట్టిని అమ్ముకుని లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ముకుందరాజుపేట, రమణయ్యపేట గ్రామాల పరిధిలో పోలవరం కాలువ మట్టిని సమీపంలో టీడీపీ నాయకులకు చెందిన భూముల్లో వేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పోలవరం కాలువ గట్లపై ఉన్న మట్టిని తవ్వడం వల్ల కాలువను ఆనుకుని ఉన్న గ్రామాలకు ముప్పు పొంచి ఉందని ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. భారీ వర్షాలు పడిన సమయంలో ఎగువ ప్రాంతాల్లో వర్షంనీరు ఈ కాలువలో భారీగా చేరుతుందని, మట్టి తవ్వడం వల్ల గట్లు బలహీన పడి కాలువకు గండి పడే ప్రమాదముందని ముకుందరాజుపేట, గుల్లిపాడు, రమణయ్యపేట, సీతంపాలెం, రామయ్యపట్నం, డొంకాడ, సీతానగరం, పి.ఎల్.పురం తదితర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం కళ్లముందే లక్షలాది క్యూబిక్ మీటర్ల పోలవరం మట్టి తరలిపోతుంటే ఇరిగేషన్ అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మట్టిని తరలించేవారికి కూటమిపార్టీల్లో ప్రముఖ వ్యక్తులతో సత్సంబంధాలు ఉండడం వల్లే అధికారులు వారిపై చర్యలకు వెనుకాడుతున్నారని తెలిసింది. మట్టితవ్వకాల వల్ల బలహీన పడుతున్న గట్లకు రక్షణ కల్పించాలని, పట్టపగలే నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తవ్వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


