షాడో | - | Sakshi
Sakshi News home page

షాడో

Jun 29 2026 1:11 AM | Updated on Jun 29 2026 1:11 AM

మాయాజాలం!
అన్ని పనులకూ ఒకటే నిబంధన.. రూ.5 కోట్ల టర్నోవర్‌ మస్ట్‌ రూ.కోటి పనులకు ‘సింగిల్‌ వర్క్‌’ నిబంధనలు ఒక్కరికే పనులు కట్టబెట్టేలా టెండర్‌ నిబంధనల మార్పు
కాంట్రాక్టులకు బహుమతిగా.. కమిషనర్‌ బంగ్లాలో రూ.50 లక్షలతో మినీ థియేటర్‌ మెట్రోపాలిటన్‌ ఖజానాకు ‘టెండర్‌’ పెడుతున్న షాడో చైర్మన్‌

వీఎంఆర్‌డీఏ టెండర్లలో

అక్రమాలకు

వత్తాసు పలుకుతున్న

అధికారులు

అంతా ‘అసిరితల్లి’

దయ అంటున్న

షాడో చైర్మన్‌

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:

సాధారణంగా ఎవరైనా అడ్డగోలు పనులను హడావిడిగా, గుట్టుచప్పుడు కాకుండా చేస్తారు. కానీ విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) లోని ‘షాడో చైర్మన్‌’ మాత్రం చాలా శ్రద్ధగా చేస్తున్నారు. ఒక ‘మినీ థియేటర్‌’ కడుతున్నట్లు, గులాబీ మొక్కకు అంటుకడుతున్నట్లు, యుద్ధ విమానాన్ని క్లీన్‌ చేస్తున్నట్లు.. ఎంతో జాగ్రత్తగా, పద్ధతిగా అవినీతికి తెరలేపారు. మెట్రోపాలిటన్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే ఒక్కరికే అన్ని పనులు దక్కేలా ఆయన పక్కా స్కెచ్‌ వేశారు. వీఎంఆర్‌డీఏలో ఈ షాడో చైర్మన్‌ ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. తమకు కావలసిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు నిబంధనలను ఇష్టారీతిన మార్చేస్తున్నారు. టెండర్లలో అసలు పోటీనే లేకుండా చేసి, తమకు కావలసిన కాంట్రాక్టర్‌కే పనులన్నీ అప్పగిస్తున్నారు.

తాజాగా పిలిచిన టెండర్లన్నింటికీ ఒకటే తరహా నిబంధనలు పెట్టడం వీఎంఆర్‌డీఏ వర్గాల్లోనే తీవ్ర విస్మయం కలిగిస్తోంది. హౌస్‌కీపింగ్‌, మెయింటెనెన్స్‌ కాంట్రాక్టులకు సంబంధించి సదరు సంస్థకు ఏకంగా రూ. 5 కోట్ల టర్నోవర్‌ ఉండాలంటూ కొత్త కొర్రీ పెట్టారు. అంతేకాకుండా కచ్చితంగా రూ. 1.20 కోట్ల నుంచి రూ. 1.50 కోట్ల విలువైన ‘సింగిల్‌ వర్క్‌’ చేసిన అనుభవం ఉండాలని టెండర్‌ డాక్యుమెంట్లలో నిబంధనను చేర్చారు. దీనికి తోడు విశాఖపట్నంలో రిజిస్ట్రేషన్‌ అయిన సంస్థకు మాత్రమే అవకాశం ఉందంటూ.. ఎన్నడూ లేని విధంగా నిబంధన పెట్టడం షాడో చైర్మన్‌ అడ్డగోలుతనానికి నిదర్శనం. సాధారణంగా రూ. కోటి లోపు విలువైన హౌస్‌ కీపింగ్‌, మెయింటెనెన్స్‌ పనులకు ఇలాంటి ‘సింగిల్‌ వర్క్‌’ కండిషన్‌ ఎక్కడా ఉండదు. కానీ, మొత్తం పనులన్నీ ఒక్కరికే అప్పగించాలన్న దురుద్దేశంతోనే ఈ కొత్త నిబంధనలను సృష్టించారన్నది స్పష్టమవుతోంది.

అంతా ‘అసిరితల్లి’ దయ!

టెండర్లలో ఇతర కాంట్రాక్టర్లెవరూ పోటీ పడకుండా చేసేందుకు పన్నిన అసలైన పన్నాగం ‘లోకల్‌ రిజిస్ట్రేషన్‌’. విశాఖపట్నంలో మాత్రమే రిజిస్టర్‌ అయిన సంస్థలకే టెండర్లలో అవకాశం ఉంటుందని కఠిన నిబంధన విధించారు. రూ. 5 కోట్ల టర్నోవర్‌, సింగిల్‌ వర్క్‌ అనుభవం, విశాఖలోనే రిజిస్ట్రేషన్‌ ఉండాలనే ఈ అర్హతలు కేవలం ఒకట్రెండు సంస్థలకు మాత్రమే ఉన్నాయని ముందే నిర్ధారించుకుని మరీ ఈ వ్యవహారం నడిపారు. ముఖ్యంగా.. ‘మాతా అసిరితల్లి’ అనే సంస్థకే కాంట్రాక్టులన్నీ కట్టబెట్టేందుకు ఈ తంతు నడిపించినట్లు తెలుస్తోంది. అన్నీ తానై నడిపిస్తున్న షాడో చైర్మన్‌ ఎంతో ‘వినయ’ంగా సదరు సంస్థకే ఎండాడ, చీమలాపల్లి వీఎంఆర్‌డీఏ కన్వెన్షన్‌ సెంటర్ల నిర్వహణ బాధ్యతల పనులను కూడా ఎలాంటి పోటీ లేకుండా అప్పగించేయడం గమనార్హం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement