బీచ్‌రోడ్డు: గడ్డు కాలంలో ఉన్న భారతదేశాన్ని తన అద్భుత సంస్కరణలతో ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన మేధావి పీవీ నరసింహారావు అని మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కొనియాడారు. పీవీ 105వ జయంతి సందర్భంగా ఆదివారం గవర్నర్ బంగ్లా ఎదురుగా ఉన్న పీవీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రతిష్టను పెంచిన పీవీ, ఆర్థిక సంస్కరణలకు పితామహుడని శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పి.వి.నారాయణ, పార్టీ నాయకులు శ్రీవాత్సవ్, పల్లా దుర్గారావు, దండూరి సుబ్రహ్మణ్యం, జె.సురేష్, రాపాక శ్రీనివాస రావు, కొయ్య చిన్ని యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ చాణక్యంతో అభివృద్ధి: దూరదృష్టి, రాజకీయ చాణక్యంతో పీవీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని హిందీ భాషా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు. పీవీ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీవీ బహుభాషా కోవిదుడని, ప్రపంచ వేదికపై భారత ప్రతిష్టను పెంచిన మహానేతగా చిరస్థాయిగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎం.శ్రీభరత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మాజీ రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్.నరసింహారావు పాల్గొన్నారు.


