ఆటస్థలంలో మొక్కలు..విద్యార్థినులకు తిప్పలు | - | Sakshi
Sakshi News home page

ఆటస్థలంలో మొక్కలు..విద్యార్థినులకు తిప్పలు

Jun 29 2026 1:05 AM | Updated on Jun 29 2026 1:05 AM

నాతవరం : కూటమి నేతలు అతి ఉత్సాహంతో గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి విద్యార్థినులకు ఆట స్థలం లేకుండా చేసి వసతి సమస్య తెచ్చిపెట్టారు. మండలంలో తాండవలో గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో సుమారుగా 300 వరకు విద్యార్థినులు చదువుతున్నారు. అసలే విద్యార్థినులకు ఆటస్థలం లేక ఉన్న కొద్దిపాటి స్థలంలోనే దుస్తులతో పాటు ఇతర సామగ్రి ఎండలో ఆరబెట్టుకోవడం జరుగుతుంది. ఈనెల 27వ తేదీన అనంత ఆరణ్య మహోత్సవం సందర్భంగా ఇరుగ్గా ఉన్న ఆశ్రమ పాఠశాల ప్రాంగణం స్థలంలో కూటమి నేతలు తాండవ ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ కరక సత్యనారాయణ, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజాన వీర సూర్య చంద్రతో పాటు టీడీపీ జనసేన నాయకులు, ఎంపీడీవో సత్య శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఆర్భాటంగా మొక్కలు నాటారు. గతంలో ఇక్కడ గిరిజన ఆశ్రమ పాఠశాల నూతన భవన నిర్మాణాలకు స్థలం చాలకపోవడంతో అప్పటి కలెక్టర్‌, పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అఽధికారి ఆదేశాల మేరకు తాండవ ప్రాజెక్టుకు చెందిన ఇరిగేషన్‌ స్థలాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విద్యార్థినులకు ఆటలు అడుకునేందుకు కొంత స్థలం మాత్రమే ఉండేది. ఆ స్థలంలో కూటమి నేతలు పూర్తిగా మొక్కలు నాటేయడంతో విద్యార్థినులు బయటకు రాకుండా గదిలోనే ఉండిపోయే పరిస్థితి నెలకొంది. భారీ వృక్షాలుగా పెరిగే మొక్కలు వేయడంతో అవి పెరిగాక భవనాలకు ప్రమాదం ఉంటుందని అంటున్నారు. పండ్ల మొక్కలు వేస్తే బాగుండేదని ఈ ప్రాంతీయులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement