ఇప్పటి వరకూ పంపిణీ చేసినవి 13,763 క్వింటాళ్లు | - | Sakshi
Sakshi News home page

ఇప్పటి వరకూ పంపిణీ చేసినవి 13,763 క్వింటాళ్లు

Jun 27 2026 12:43 AM | Updated on Jun 27 2026 12:43 AM

నాసిరకం విత్తనాలపై రైతుల్లో ఆందోళన గ త ఏడాది రైతు సేవా కేంద్రాల్లో వరి విత్తనాల్లో పొల్లు, కేళీలు ప్రభుత్వ నిర్లక్ష్యంతో నష్టపోతున్న రైతులు ఈ ఏడాదైనా నాణ్యమైన విత్తనాలు అందేనా..!

మొత్తం ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం 1,70,569 ఎకరాలు

ఖరీఫ్‌కు సిద్ధం చేసిన విత్తనాలు 22,062

క్వింటాళ్లు

వీటిలో వరి విత్తనాలు 21,000

క్వింటాళ్లు

అందుబాటులో ఉన్నది

3,485

మెట్రిక్‌ టన్నులు

యూరియా

పంపిణీ

2,722

మెట్రిక్‌ టన్నులు

పంపిణీ చేసినవి 928

క్వింటాళ్లు

గడ్డి విత్తనాలు 1062

క్వింటాళ్లు

జిల్లాలో రైతు సేవా కేంద్రాలు

432

సాక్షి, అనకాపల్లి : ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. రైతులు పొలాలను సాగుకు సిద్ధం చేస్తూ, వరి నారు వేసుకునేందుకు విత్తనాల కోసం ఎదురుచూస్తున్నా రు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ముందస్తుగా రావడంపై రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నప్పటికీ, ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం, భరోసా కరువవ్వడంతో వారిలో భయాందోళనలు రేకెత్తుతున్నాయి. విత్తనాల విషయంలో ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో రైతులకు పంపిణీ చేసేందుకు 22,062 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం చేశారు. వీటిలో ఇప్పటికి 14,691 క్వింటాళ్లు పంపిణీ చేశారు. వరి విత్తనాలు 13,763 క్వింటాళ్లు రైతులకు అందజేశారు. యూరియా 2,722 మెట్రిక్‌ టన్నులు పంపిణీ చేయగా, 3,485 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉన్నట్టు అధికా రులు తెలిపారు.

రెండేళ్లుగా పంట నష్టాలు..

గత రెండేళ్లగా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో అన్నదాతలు తీవ్ర పంట నష్టాలను చవి చూశారు. దీనికి తోడు పెట్టుబడి సాయం అందకపోవడంతో జిల్లాలోని మెజారిటీ రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఈ ఏడాదైనా ప్రకృతి సహకరించి, ప్రభుత్వం నుంచి సబ్సిడీ విత్తనాలు, పెట్టుబడి సాయం, ఎరువులు సకాలంలో అందితే ఆశించిన మేర దిగుబడులు సాధించవచ్చని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రైతులకు నకిలీల ముప్పు లేకుండా, ఎరువుల కొరత రాకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంది. ఈ ఏడాదైనా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు నాణ్యమైన సేవలు అందించాలని జిల్లా రైతాంగం కోరుతోంది.

గత చేదు అనుభవాలు..వెంటాడుతున్న భయం

గత ఏడాది రైతు సేవా కేంద్రాల (ఆర్‌బీకే) ద్వారా పంపిణీ చేసిన వరి విత్తనాలు నాసిరకంగా ఉండడంతో రైతులు నిలువునా మునిగిపోయారు. పంపిణీ చేసిన విత్తనాల్లో మొలక శాతం పరీక్షించకుండానే నేరుగా రైతులకు విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి. వాటిలో పొల్లు, కేళీలు (కల్తీలు) ఎక్కువగా ఉండడం వల్ల వరి నారు సరిగ్గా మొలకెత్తలేదు. దీంతో పెట్టుబడి పెట్టి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు తీవ్ర ఇబ్బందులకు గురై, నష్టాల బాట పట్టాల్సి వచ్చింది. ఈ ఏడాది కూడా అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విత్తన నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

నిర్వీర్యమైన అగ్రి ల్యాబ్స్‌..!

‘విత్తనం మంచిదైతే.. పంట బాగుంటుంది.. పంట బాగుంటే దిగుబడిపై దిగులుండదు’. రైతులు నకిలీ, నాసిరకం విత్తనాలతో మోసపోకుండా ఉండేందుకు గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ’వైఎస్సార్‌ అగ్రి ల్యాబ్స్‌’ను అందుబాటులోకి తెచ్చింది. ల్యాబ్స్‌లో విత్తనాలను క్షుణ్ణంగా పరీక్షించి, నాసిరకం, పొల్లు లేకుండా నిర్ధారించిన తర్వాతే రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేసేవారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో అగ్రి ల్యాబ్స్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ల్యాబ్స్‌ పనితీరు మందగించడం వల్లే మార్కెట్లోకి నాసిరకం విత్తనాలు వస్తున్నాయని, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని రైతు సంఘాలు మండిపడుతున్నాయి.

నాణ్యతపై రాజీలేదు...

ఈ ఏడాది ఖరీఫ్‌కు నాణ్యమైన వరి, చెరకు, పత్తి, అపరాలు, గడ్డి విత్తనాలు, ఎరువులు సిద్ధం చేశాం. జిల్లాలో ఉన్న అన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేస్తున్నాం. నాణ్యతలో ఎక్కడా రాజీపడేది లేదు. రైతు సేవా కేంద్రాల్లో, ప్రైవేట్‌ దుకాణాల్లో ఎక్కడా నకిలీ విత్తనాల పంపిణీకు ఆస్కారం లేదు. అలా మా దృష్టికి వస్తే వారిపై చర్యలుంటాయి. ఖరీఫ్‌ సాగుకు ముందు మండల అగ్రికల్చర్‌ అధికారులు, రైతు సేవా కేంద్రాల్లో ఉన్న అగ్రి అసిస్టెంట్‌లతో ఖరీఫ్‌ పంటలపై, భూసారంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రైతు వరి నారు వేసే సమయంలో భూసారం, జింకు లోపం వంటివి సమతుల్యంగా ఉండేలా అవగాహన కల్పిస్తున్నాం.

– ఆశా దేవి, జిల్లా వ్యవసాయ అధికారి

నాసిరకం విత్తనాలతో నష్టం

గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో బుచ్చెయ్యపేట మండలంలో కేపీ అగ్రహారానికి చెందిన గోపిశెట్టి శ్రీను రైతు సేవా కేంద్రంలో ఆర్‌జేఎల్‌ 2537 రకం మూడు బస్తాల వరి విత్తనాలను రూ.3 వేలకు కొనుగోలు చేశారు. దమ్ము చేసి వరి నారు వేశారు. విత్తనాలు వేసి 18 రోజులైనా సరిగా మొలకెత్త లేదు. మూడు బస్తాలు విత్తనాలు వేస్తే.. ఒక బస్తాకి తగ్గ వరి విత్తనాల వేస్తే వచ్చే నారు వలే పలుచగా తయారైంది. ఇతర రైతులకు చూపించగా నాసిరకం విత్తనాలుగా గ్రహించారు. రైతు సేవాకేంద్రంలో అగ్రి అసిస్టెంట్‌ను ప్రశ్నించగా మాకు ఇలానే వచ్చాయి. అవే ఇచ్చామని చెప్పారు. ఆ రైతు ఏమి చేయలేక ప్రైవేట్‌ దుకాణానికి వెళ్లి కొనుగోలు చేసి, వేశారు.

గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో నాతవరం మండ లం ఎస్‌బీ పట్నం గ్రామానికి చెందిన గాడి గణేష్‌ రైతు సేవా కేంద్రంలో 1,262 రకం నాలుగు బస్తాల వరి విత్తనాలు తీసుకున్నారు. వరి నారు వేయడానికి ఆ మూటలు విప్పగా అందులో కేళీ ధాన్యం ఎక్కువగా ఉన్నాయి. 30 శాతానికి పైగా కేళీ ఉండడంతో ఆ బస్తాల నుంచి పొల్లుగా ఉన్న విత్తనాలను సెపరేట్‌గా చేసి నారు వేశారు. దీంతో వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేస్తే సరిచేస్తామని చెబుతున్నారు.

విత్తు... ఆదమరిస్తే

విపత్తు!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement