మాలలపై హోంమంత్రి వివక్ష | - | Sakshi
Sakshi News home page

మాలలపై హోంమంత్రి వివక్ష

Jun 27 2026 12:43 AM | Updated on Jun 27 2026 12:43 AM

పాయకరావుపేట: మాలలపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతూ అన్యాయం చేస్తోందని, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన హోంమంత్రి వంగలపూడి అనిత సైతం మాలల పట్ల వివక్ష చూపుతున్నారని మాల మహానాడు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకటరావు ఆరోపించారు.మాలల ఐక్యత చైతన్య యాత్రలో భాగంగా శుక్రవారం ఆయన పాయకరావుపేటలో విలేకరులతో మాట్లాడారు. హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకు రాష్ట్రవ్యాప్తంగా మాలల హక్కులు కాపాడుకోవడం కోసం చైతన్య యాత్ర నిర్వహిస్తున్నట్టు చెప్పారు. నియోజకవర్గంలోను, రాష్ట్రంలోను మాలలపై దాడులు , అత్యాచారాలు జరుగుతుంటే హోంమంత్రి స్పందించడం లేదని, కనీసం పరామర్శించడం లేదని చెప్పారు. మంత్రిగా కొనసాగే అర్హత ఆమెకు లేదన్నారు. హోంమంత్రితో పాటు ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కూడా మాలలకు వ్యతిరేకరంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో.. 18 మంది మాలలపై అత్యాచారాలు, దాడులు జరిగితే కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే మాలల పట్ల వివక్ష చూపిస్తున్నారని, మంత్రులు, కమిషన్‌ చైర్మన్లు అదే దారిలో ప్రయాణం చేస్తారన్నారు. ముఖ్యమంత్రి, హోంమంత్రిపై ప్రజల్లో నమ్మకంపోయిందని, ముఖ్యంగా మాలల్లో వారు నమ్మకం కోల్పోయారని చెప్పారు. రాష్ట్రంలో అడవులు, ప్రభుత్వ భూము లు, చివరకు సముద్రజలాలను కూడా కూటమి నాయకులు కబ్జాచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పంపిణీ చేస్తున్న 65లక్షలపెన్షన్లలో 25లక్షలు అగ్రవర్ణాల వారికే ఇస్తున్నారని చెప్పారు. మాదిగల్లో చెప్పులు కుట్టేవారికి, డప్పు కళాకారులకు పింఛన్లు ఇస్తున్నారని, మాలలకు మాత్రం పింఛన్లు మంజూరు చేయడం లేదన్నారు. గ్రామస్థాయి నుంచే ప్రతి నియోజకవర్గంలో 25 వేల మాలల ఓట్లు తొలగించే కుట్రజరుగుతోందని ఆరోపించారు. మాలలు, ముస్లిం, క్రిస్టియన్‌ ఓట్లను తొలగించేందుకు యత్నిస్తున్నారు. మాలల్లో 40 శాతం మంది కూటమిపార్టీలకు, పవన్‌కల్యాణ్‌కు ఓట్లేశారన్నారు. అధికారంలోకి వచ్చాక మాలలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాలల హక్కుల సాధనకు విజయవాడ నడిబొడ్డున 10 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని, దీని కోసం మాలల చైతన్య యాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సమావేశంలో మాలల సంక్షేమ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కోట్ల గంగాధర్‌,మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్‌కుమార్‌, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గోదా జాన్‌పాల్‌, మాల మహానాడు స్థానిక నాయకులు పెదపాటి మేఘరంజన్‌, నెలపర్తి అర్జున్‌, ఇంజరపు సూరిబాబు, గారా రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

అనితకు మంత్రిగా కొనసాగే అర్హతలేదు

ప్రతి నియోజకవర్గంలో 25వేల

మాలల ఓట్ల తొలగింపునకు కుట్ర

10లక్షల మందితో విజయవాడలో సభ

మాల మహానాడు

రాష్ట్రఅధ్యక్షుడు వెంకటరావు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement