అనకాపల్లి : పారిశ్రామిక ప్రాంతంలో పరవాడ సమీపంలో ఉన్న కల్పక– అచ్యుతాపురంలో ఉన్న బ్రాండిక్స్ సబ్‌స్టేషన్ల మధ్య 220 కేవీ విద్యుత్ టవర్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గొలుగొండ, నాతవరం మండలాల పరిధిలో వ్యవసాయ విద్యుత్ సరఫరా వేళల్లో మార్పులు చేసినట్టు ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ ప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. గృహ వినియోగదారులకు విద్యుత్ అంతరాయం లేకుండా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. రైతులకు రోజుకు రెండు విడతల్లో మొత్తం 9 గంటల పాటు త్రీ–ఫేజ్ విద్యుత్ సరఫరా చేయనున్నామని, మొదటి ఫేజ్‌గా ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు (4 గంటలు), రెండో ఫేజ్‌లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు (5 గంటలు) వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. టవర్ల నిర్మాణ పనులు జరుగుతున్నందున రైతులు ఈ సమయాలను గమనించి, అధికారులకు సహకరించవలసిందిగా ఎస్‌ఈ ప్రసాద్ కోరారు.


