ఎస్.రాయవరం : బంగారమ్మపాలెం సమీపంలో శారదా, వరాహనదుల కలయిక వద్ద వరాహనది ప్రాంగణంలో 9వ తరగతి విద్యార్థి ఈతకోసం వెళ్లి గల్లంతైనట్టు ఎస్‌ఐ రమేష్ గురువారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కారే అశోక్(14) గురువారం సెలవు కావడంతో గ్రామంలో శివారులో వరాహనదిలో తెప్పలు నిలిపే చోటుకు వెళ్లి ఈత కోసం నదిలో దిగి గల్లంతయ్యాడని చెప్పారు. వెంటనే స్థానికులు వెతికినా కనిపించకపోవడంతో, సమీపంలో ఉన్న ఎన్‌ఏవోబి సిబ్బందిని, బాలుడిని వెతికేందుకు సహకరించాలని ఎస్‌ఐ కోరడంతో ఆ సిబ్బంది నదిలో సాయంత్రం వరకు గాలించారు. గల్లంతైన వెంటనే బాలుడు నది అడుగున ఉన్న ఊబిలో కూరుకు పోయి ఉండవచ్చని చెబుతున్నారు. చీకటి పడడంతో గాలింపు పనులు నిలిపివేసి, శుక్రవారం మరళా గాలింపు చేస్తామని చెప్పారు. వివరాల మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.


