ఎస్.రాయవరం : బైకుతో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్‌స్తంభాన్ని ఢీకొని వ్యక్తి మృతి చెందినట్టు ఎస్‌ఐ రమేష్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గుర్రాజుపేట గ్రామానికి చెందిన గొంప అప్పారావు(42) గ్రామం నుంచి తన బైకులో పెట్రోలు పోయించుకునేందుకు రేవు పోలరవం వైపు బయలుదేరాడు. ఈ సమయంలో బైకు స్టాండ్ తీయకపోవడంతో సైడ్ స్టాండ్ రోడ్డుకి తగిలి బైకు అదుపు తప్పింది. ఆర్‌వీనగర్ పేటగడ్డ మదుంవద్ద రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టడంతో తలకు బలమైన గాయం అయ్యింది. స్థానికులు వెంటనే అప్పారావును నక్కపల్లి ఆసుపత్రికి తరలించారు. అధిక రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ అప్పారావు మృతి చెందినట్టు చెప్పారు. వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.


