ఖరీప్ సాగుకు సకాలంలో నీరు విడుదల చేసే అవకాశం
ప్రాజెక్టులో 374.6 అడుగులు నీటి మట్టం
వరి పంట సాగుకు వరినారు సిద్దం చేసుకోవాలని రైతులకు అధికారులకు సూచన
నాతవరం : జిల్లాలో ఏకై క మేజరు ప్రాజెక్టు తాండవ రిజర్వాయరులో నీటినిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఖరీఫ్ సీజన్‌లో సాగుకు నీటి విడుదల సకాలంలోనే విడుదల చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. తాండవ రిజర్వాయరు ప్రఽమాద స్థాయి నీటి మట్టం 380 అడుగులు కాగా డేడ్ స్టోరేజీ 345 అడుగులుగా అధికారులు పరిగణిస్తారు. తాండవలో నీటి మట్టం గురువారం సాయంత్రానికి 374.6 అడుగులు ఉంది. గత నెలలో నీటి మట్టం 373,6 అడుగులు ఉండేది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో వచ్చి చేరడంతో తాండవ ప్రాజెక్టులో ఓ మోస్తరు నీటి మట్టం పెరిగింది. తాండవ రిజర్వాయరు నీరు అధారంగా అనకాపల్లి జిల్లాలో నాతవరం, కోటవురట్ల, నర్సీపట్నం, పాయకరావుపేట మండలాలు ఉండగా కాకినాడ జిల్లాలో కోటనందూరు, తుని, రౌతులపూడి, శంఖవరం మండలాలు పరిధిలో ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్‌లో సుమారుగా 52వేల ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నారు. ఖరీఫ్ సాగుకు ప్రతి ఏటా ప్రజా ప్రతినిధులు తాండవ ప్రాజెక్టు కమిటీ సభ్యులు ఆయకట్టుదారులు సాగు రైతులు అభీష్టం మేరకు నీటి మట్టాన్ని పరిశీలించి నీటిని ఆగస్టులో ప్రధాన గేట్లు నుంచి ఆయకట్టుకు నీరు విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది తాండవ రిజర్వాయరులో నీటి మట్టం సమృద్ధిగా ఉండడంతో రైతులు ప్రాజెక్ట్ కమిటీ సభ్యులు ఆమోదం మేరకు ముందుగానే నీరు విడుదల చేసే అవకాశం కన్పిస్తుంది. రానున్న కాలంలో భారీ వర్షాలు కురిసి ఎగువ ప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో నీరు పెరిగితే తాండవ రిజర్వాయరు నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరే అవకాశం ఉంది. నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరితే వృథాగా నీటిని స్పిల్‌వే గేట్ల ద్వారా నదిలోకి విడుదల చేస్తుంటారు. అందుచేత ప్రస్తుతం తాండవ ప్రాజెక్టులో నీటి నిల్వలు బాగుండడంతో ఖరీఫ్‌లో సాగుకు సకాలంలో నీరు విడుదల చేసేందుకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయంపై తాండవ ప్రాజెక్టు జేఈ శ్యామ్‌కుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు సకాలంలో నీరు విడుదల చేస్తామని ఆయకట్టు పరిధిలో రైతులంతా వరినారు సిద్ధం చేసుకోవాలని సూచించారు.


