డ్రగ్స్‌ రహిత సమాజమే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ రహిత సమాజమే ధ్యేయం

Jun 26 2026 3:59 AM | Updated on Jun 26 2026 3:59 AM

యలమంచిలి రూరల్‌ : మాదకద్రవ్యాలు, ఇతర మత్తు పదార్థాల వినియోగం విద్యార్థులు, యువత భవిష్యత్తులను నాశనం చేస్తుందని జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా అభిప్రాయపడ్డారు. నషా ముక్త్‌ భారత్‌ సప్తాహ్‌లో భాగంగా గురువారం యలమంచిలి భాష్యం స్కూల్లో వివిధ కళాశాలల విద్యార్థులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం వలన కలిగే నష్టాలను వివరించారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగం విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో వివరించారు. మాదక ద్రవ్యాలను ప్రోత్సహించే స్నేహితులను దూరంగా ఉంచాలని విద్యార్థులకు సూచించారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసుల్లో నిందితులుగా నమోదైతే ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం కష్టమవుతుందన్నారు. దేశాభివృద్ధికి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం తీవ్ర విఘాతం కలిగిస్తుందన్నారు. భావితరాల సంక్షేమం దృష్ట్యా మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాల్సిన బాధ్యత ఉందన్నారు. మత్తుపదార్థాల రహిత సమాజ నిర్మాణానికి అందరూ తమ వంతు కృషి చేయాలన్నారు. పరవాడ డీఎస్పీ బి. మోహన్‌రావు మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం జీవితాన్ని నాశనం చేస్తుందన్నారు. డ్రగ్స్‌ వినియోగించినా, అమ్మినా, రవాణా చేసినా కటకటాల పాలవుతారన్నారు. మత్తు పదార్థాలు ఎవరైనా అమ్ముతున్నట్టు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోలీసులు తీసుకుంటున్న చర్యలకు అందరూ సహకరించాలన్నారు. అనంతరం డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని,దేశ నిర్మాణంలో భాగస్వాములు అవుతామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అనకాపల్లి మహిళా పోలీస్‌ స్టేషన్‌ డీఎస్పీ ఈ శ్రీనివాసులు,యలమంచిలి సీఐ ధనుంజయరావు,ఎన్‌డీపీఎస్‌ విభాగం సీఐ పిల్లా రమేష్‌, ఎస్‌ఐలు కె.సావిత్రి, ఎం.ఉపేంద్ర, బి. రామకృష్ణ, ప్రసాదరావు, మహిళాశిశు సంక్షేమం సిబ్బంది, మహిళా పోలీసులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement