పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీపై
తుమ్మపాల : ప్రభుత్వ ప్రాధాన్యత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో నిర్దేశిత లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం వీసీ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశంలో పలు కీలక అంశాలపై అధికారులతో చర్చించారు. పీజీఆర్‌ఎస్‌కు అందుతున్న ప్రజా వినతులను సంబంధిత మండలాలకు వెంటనే పంపించి, వాటి పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఆరు నెలలుగా పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసినప్పటికీ కొందరికి అందలేదని అర్జీలు వస్తున్నాయని తక్షణమే మిగిలిన వాటిని పంపిణీ చేయుటకు శ్రీకారం చుట్టాలని ఎమ్మార్వోలు, వీఆర్వోలను ఆదేశించారు. క్షేత్రస్థాయి సర్వేలో ఎంత భూమి సాగు చేస్తున్నారు. ఎంతమంది ఉన్నారు.. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు సరిపోయాయా లేదా చూసి ఈ– కే వైసీ ద్వారా ఆధార్ నెంబరు, డాక్యుమెంట్ నెంబర్ చెక్ చేసుకొని పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ చేయలన్నారు.
జేసీ శౌర్యమాన్ పటేల్ మాట్లాడుతూ ఈ–కేవైసీ, మన మిత్ర, క్రాప్ బుకింగ్, ఓడీఎఫ్ గ్రామాలు, డీఆర్‌డీఏ కార్యక్రమాలు, స్వచ్ఛాంధ్ర ప్రభుత్వ కార్యక్రమాల పురోగతిని సమీక్షించి, నిర్ణీత గడువులో లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. గృహ నిర్మాణాలు, పీఎం సూర్య ఘర్ యోజనలో నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు.
గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యమిస్తూ ఓడీఎఫ్ హోదాను కొనసాగించేలా చర్యలు చేపట్టాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్‌ఓ వై.శ్రీనివాస్‌తో పాటు జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.


