బుచ్చెయ్యపేట : మండలంలోని ఆర్.భీమవరంలో అధికారులు పర్యటించారు. ఆర్. భీమవరంను వేధిస్తున్న కిడ్నీ సమస్యపై గురువారం ప్రచురితమైన సాక్షి కథనానికి అధికారులు స్పందించారు. ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ ఉమా మహేశ్వరరావు, చోడవరం ల్యాబ్ నీటి సాంద్రత సిబ్బంది, వైద్య సిబ్బంది గ్రామంలో పర్యటించారు. కిడ్నీ సమస్యతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి వివరాలు, ఇంకా కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న వారి వివరాలు అధికారులు సేకరించారు. పలువురు ఇళ్లకు వెళ్లినపుడు మంచినీరు వల్లే కిడ్నీ జబ్బుల బారిన పడుతున్నామని గ్రామస్తులు అధికారులకు తెలిపారు. దీంతో అధికారులు పలువురి ఇళ్లకి వెళ్లి కుళాయిల నుంచి అలాగే గ్రామం అంతటికి నీటిని సరఫరా చేస్తున్న బోరు పంపు నుంచి వేరువేరుగా నీటి శాంపిల్స్ తీసి పరీక్షించారు. అలాగే చోడవరం, విశాఖ ల్యాబ్‌లకు శాంపిల్స్ తీసిన నీటిని తరలించారు. గ్రామంలో తాగునీరు కలుషితం అవుతున్నదీ లేనిది మంచినీటి పైపులను పరిశీలించారు. ల్యాబ్‌ల నుండి వచ్చిన మంచినీటి రిపోర్టులు ఆధారంగా కిడ్నీ సమస్య ఎందుకు వస్తున్నది తెలియజేస్తామని గ్రామ పెద్దలు బల్లిన అమ్మునాయుడు, గొల్లవిల్లి సత్యనారాయణ, నాయుడు తదితరులకు అధికారులు తెలిపారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్ వెంకటేష్, పంచాయతీ సెక్రటరీ కె. ప్రభాకర్, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.


