పాఠశాల తెరిచి రెండు వారాలైనా చేరని విద్యార్థులు అడ్మిషన్ల కోసం ఇంటింటికీ వెళ్లి ప్రాథేయపడుతున్న ఉపాధ్యాయులు జిల్లాలో మొత్తం 300కి పైగా ఏకోపాధ్యాయ స్కూళ్లు వాటిలో 100 పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య సింగిల్‌ డిజిట్‌కి పరిమితం 20 స్కూళ్లలో ఒక్కరూ చేరని పరిస్థి | - | Sakshi
Sakshi News home page

పాఠశాల తెరిచి రెండు వారాలైనా చేరని విద్యార్థులు అడ్మిషన్ల కోసం ఇంటింటికీ వెళ్లి ప్రాథేయపడుతున్న ఉపాధ్యాయులు జిల్లాలో మొత్తం 300కి పైగా ఏకోపాధ్యాయ స్కూళ్లు వాటిలో 100 పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య సింగిల్‌ డిజిట్‌కి పరిమితం 20 స్కూళ్లలో ఒక్కరూ చేరని పరిస్థి

Jun 25 2026 1:06 AM | Updated on Jun 25 2026 1:06 AM

సాక్షి, అనకాపల్లి: ఇలా ఒకటి కాదు..జిల్లాలో 20కి పైగా ఏకోపాధ్యాయ పాఠశాలల్లో విద్యార్థులు ఒక్కరూ కూడా లేరు. బడి తెరిచి రెండు వారాలవుతున్నా ఒక్క విద్యార్థి కూడా అడుగుపెట్టలేదు. మరో 100 పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పది లోపే (సింగిల్‌ డిజిట్‌) ఉంది. పాఠశాలలు పునఃప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు పాతాళానికి పడిపోయింది. మౌలిక వసతుల లేమి, పర్యవేక్షణ లోపం కారణంగా ఉపాధ్యాయులు ఉన్నచోట విద్యార్థులు కరువవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్య వ్యవస్థ క్షీణించడంతో ప్రైవేట్‌ బాట పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా వందలాది పాఠశాలలు మూతపడే దిశగా సాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

బడిబాట

పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలి

‘సున్నా’ సారు.. డిప్యుటేషన్‌ జోరు!

విద్యార్థులు ఒక్కరూ లేని పాఠశాలకు ఉపాధ్యాయుడిని కేటాయించిన విడ్డూరమైన ఘటన మాకవరపాలెం మండలంలోని బూరుగుపాలెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వెలుగు చూసింది. ఈ పాఠశాలలో గతేడాది ఒకటి నుంచి ఐదో తరగతి వరకు కేవలం ఇద్దరే విద్యార్థులు ఉండేవారు. ఇక్కడ రెగ్యులర్‌గా పనిచేసే ఉపాధ్యాయురాలు వేసవి సెలవులకు ఆరు నెలల ముందే వ్యక్తిగత కారణాలతో ముందస్తు పదవీ విరమణ చేశారు. దీంతో అప్పటి నుంచి అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌తోనే మమ అనిపించారు. వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12న పాఠశాల తెరిచినా.. ఇప్పటి వరకు ఈ బడిలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. ఇదే గ్రామంలో 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్న హైస్కూల్‌ అందుబాటులో ఉండడంతో, తల్లిదండ్రులు తమ పిల్లలను అక్కడే చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఒక్క విద్యార్థి కూడా లేని ఈ ప్రాథమిక పాఠశాలకు అధికారులు రోజూ ఒక ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్‌్‌పై పంపుతుండడం విమర్శలకు తావిస్తోంది. రోజూ వచ్చే సారు ఖాళీ క్లాస్‌ రూమ్‌లో బెంచీలను, టేబుళ్లను చూస్తూ కూర్చోవడం తప్ప మరేం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. విద్యార్థులు లేని బడికి డిప్యుటేషన్లు ఎందుకని విద్యాశాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు.

ఒక్క విద్యార్థి కూడా లేని స్కూళ్లు 20..!

ఇది కేవలం బూరుగుపాలెం సమస్య మాత్రమే కాదు.. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి తాండవిస్తోంది. జిల్లాలో మొత్తం 1436 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, అందులో ప్రైమరీ 1037, అప్పర్‌ ప్రైమరీ 57, హైస్కూల్స్‌ 342 ఉన్నాయి. వీటిలో 300కి పైగా స్కూళ్లు కేవలం ఏకోపాధ్యాయుడి (సింగిల్‌ టీచర్‌)తో నడుస్తున్నాయి. ఒక్క విద్యార్థి కూడా లేని పాఠశాలలు 20 వరకూ ఉన్నాయి.

దైన్య స్థితిలో ఉపాధ్యాయులు

పాఠశాలల్లో పిల్లల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి, గ్రామసభలు పెట్టి తమ బడిలో పిల్లలను చేర్పించాలంటూ తల్లిదండ్రులను ప్రాధేయపడినా విద్యార్థులు చేరడం లేదు. విద్యా వ్యవస్థపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం, విద్యా కానుక కిట్లు ఇవ్వకపోడం, గతేడాదిలో తల్లికి వందనం అరకొరగానే ఇవ్వడం, నాడు–నేడు ద్వారా స్కూల్‌ మౌలిక వసతులు కల్పించకపోవడం వంటి మరెన్నో కారణాలు విద్యార్థులను చేరకుండా దూరం చేస్తుంది. ఇప్పటికై నా ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి, జిల్లాలోని ఏకోపాధ్యాయ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థుల నమోదు పెంచేలా చర్యలు తీసుకోవాలని, అలాగే హేతుబద్ధత లేని డిప్యుటేషన్లను రద్దు చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

జిల్లాలో ఏకోపాధ్యాయ పాఠశాలలు

జిల్లాలోని కె.కోటపాడు(31), పరవాడ(32), అచ్యుతాపురం(27), సబ్బవరం(26), కశింకోట(25), దేవరాపల్లి(25), చోడవరం(21), కోటవురట్ల(22)తో పాటు పలు మండలాల్లోని ఏకోపాధ్యాయ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 20 లోపు లేదా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది. గవరపేట, చినబొడ్డేపల్లి, చిప్పాడ, శ్రీరాంపురం, విశారపుదొడ్డి వంటి గ్రామాల్లో ఒకటి, రెండు సీట్లతోనే బడులు నడుస్తున్నాయి. వీటిలో..

నర్సీపట్నం మున్సిపాలిటీలో కొత్తవీధి, రూరల్‌లో పాత ఉప్పరగూడెం, అప్పనపాలెంలో ప్రాథమిక పాఠశాలల్లో 20 లోపు విద్యార్థులు ఉన్నారు.

మాకవరపాలెంలో 20 లోపు విద్యార్థులు ఉన్న 30 స్కూల్స్‌ ఉన్నాయి. వీటిలో వెంకయ్యపాలెంలో ప్రాథమిక పాఠశాలలో కూడా ముగ్గురు, నలుగురు విద్యార్థులు ఉన్నారు. గ్రామ సభలు పెట్టి విద్యార్థులు పాఠశాలల్లో చేరాలని సమావేశాలు పెడుతున్నా ఫలితం ఉండడం లేదు.

గొలుగొండ మండలంలో విప్పలపాలెం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో 8 మంది విద్యార్థులు ఉన్నారు. నాతవరం మండలంలో ఐదు పాఠశాలలున్నాయి.

పాయకరావుపేట మండలంలో 8 ఏకోపాధ్యాయ పాఠశాలున్నాయి. అక్కడ 20 లోపు విద్యార్థులున్నారు. అరట్లకోట, కొత్తూరు, కువాడ, సత్యవరం, పెద్దిపాలెం, ఎం.ఎస్‌ పేట, కండిపేట, రాజయ్యపేట గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలల్లో 20 లోపు విద్యార్థులున్నారు.

కోటవురట్ల మండలంలో 22 పాఠశాలల్లో 20 లోపు విద్యార్థులున్నాయి. చినబొడ్డేపల్లి గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు, కోటవురట్ల శివారు గవరపేట స్కూల్లో ఒకరే విద్యార్థి ఉన్నారు.

ఎస్‌.రాయవరం మండలంలో మూడు ఏకోపాధ్యాయ స్కూళ్లు ఉన్నాయి. కాపులవాతాడ, చిన ఉప్పల, బసవపాడు ప్రాథమిక పాఠశాల్లో 20 లోపు విద్యార్థులున్నారు.

అనకాపల్లి మండలంలో 18 పాఠశాలలున్నాయి. కశింకోట మండలంలో 25 ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి.

యలమంచిలి మండలంలో 8 పాఠశాలలున్నాయి.అచ్యుతాపురం రూరల్‌ మండలంలో 27 ఉన్నాయి. చిప్పాడ, వెంకటాచలం, భోగాపురం గ్రామాల్లో ఒకరు లేదా ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఉన్నారు.

మాడుగుల మండలంలో 5 పాఠశాలలు ఉన్నాయి. ముకుందపురం, బిల్లలపాలెం, పోతనపూడి, వాడపాడు ప్రాథమిక పాఠశాలలో 20 లోపు విద్యార్థులున్న ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి.

కె.కోటపాడు మండలంలో 31 ఏకోపాధ్యాయ స్కూల్స్‌ ఉన్నాయి. ఇందులో మూడు పాఠశాలల్లో విద్యార్థులు ఒక్కరూ లేరు.

దేవరాపల్లి మండలంలో 25 ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. శ్రీరాంపురం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు, తెనుగుపూడి పంచాయితీలో విషారపుదొడ్డిలో ఇద్దరు విద్యార్థులు, ఎం.అలమండ గ్రామంలో ఇద్దరు విద్యార్థులున్నారు.

చీడికాడ మండలంలో 11 పాఠశాలలున్నాయి.

చోడవరం మండలంలో ఏకోపాధ్యాయ స్కూల్స్‌ 21 ఉన్నాయి.

రోలుగుంట మండలంలో 15 ఏకోపాధ్యాయ స్కూల్స్‌ ఉన్నాయి. ఎన్‌.కొత్తూరు. తడాలపాలెం, మునిపల్లి, ఎం.కే పట్నం గ్రామాలో సింగిల్‌ డిజిట్స్‌కే పరిమితమయ్యారు.

బుచ్చెయ్యపేట మండలంలో 8 పాఠశాలలున్నాయి.

పరవాడలో 32 ఏకపాధ్యాయ స్కూళ్లు ఉన్నాయి.

సబ్బవరం మండలంలో 26 ఏకోపాధ్యాయ స్కూళ్లు ఉన్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement