ఏడాదిన్నరలో 12 మంది మృత్యువాత
పలువురు కిడ్నీ సమస్యతో అవస్ధలు
గ్రామంలో మంచినీటి సమస్యే
కారణమంటున్న గ్రామస్తులు
నిగ్గు తేల్చని అధికారులు
బుచ్చెయ్యపేట : మండలంలోని ఆర్.భీమవరం గ్రామస్తులను కిడ్నీ సమస్య వేధిస్తుంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడాదిన్నరలోనే గ్రామంలో కిడ్నీ సమస్యతో 12 మంది మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారంతా 70 నుండి 90 ఏళ్లు వృద్ధాప్యం వచ్చినవారు కాదు 30 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు లోపువారే. బుధవారం గ్రామానికి చెందిన పతివాడ సన్యాసినాయుడు 45 ఏళ్లకే మృతి చెందాడు. ఇతనికి భార్య కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుటుంబ పెద్ద దిక్కు మృతితో వీరు రోడ్డున పడ్డారు. ఇటీవల కాలంలో గ్రామానికి చెందిన పతివాడ సన్యాసినాయుడుతో పాటు రొంగలి చిన్నంనాయుడు, రెడ్డి అప్పారావు, మట్టా నూకరత్నం, బల్లిన అప్పలనాయుడు, రాపర్తి అప్పారావు, పాలిశెట్టి సరోజిని, మట్టా అప్పారావు, కొండ్రపు చెల్లయమ్మ, కోడూరు దేముడు (బట్టయ్య) కోడూరు క్రిష్ణయ్య, బొడ్డు సత్తిబాబు(పాత్రుడు)లు కిడ్నీ సమస్యతో చనిపోయారు. ఇంకా గ్రామంలో మట్టా అప్పారావు, కోడూరు దేముడు, రొంగలి చిన్నంనాయుడు, మట్టా కార్తీక్ తదితరులు కిడ్నీ సమస్యతో మంచాన పడి డయాలసిస్ చేయించుకుంటూ వైద్య సేవలు పొందుతున్నారు. గ్రామంలో మరికొంత మంది కిడ్నీ సమస్యలతో అవస్థలు పడుతున్నారు. వైద్య పరీక్షలు చేయించుకుంటే తమకు కిడ్నీ సమస్య ఉందని తెలిస్తే వైద్యానికి లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సివస్తుందని పలువురు ఎటువంటి వైద్య సేవలు చేయించుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
తాగునీటి కాలుష్యం వల్లేనా...?
సుమారు నాలుగు వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో 60 వేల లీటర్లు సామర్థ్యం ఉన్న మంచినీటి ట్యాంకు ద్వారా గ్రామస్తులందరికి తాగునీరు అందిస్తున్నారు. ఈ ట్యాంకు నీరు తాగడం వల్లే కిడ్నీ జబ్బుల బారిన పడుతున్నామని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మంచినీళ్లు పట్టుకుంటే మీద ఆయిల్ తేలుతుందని పలువురు తెలియజేస్తున్నారు. పలుసార్లు తమ గ్రామంలో ఉన్న మంచినీటిని పరీక్షించి తాగడానికి మంచిదో కాదో నిగ్గు తేల్చాలని గ్రామస్తులు అధికారులు దృష్టికి తీసుకెళ్లినా నీటి పరీక్షలు మాత్రం బయటపెట్టడం లేదు. ఒకే గ్రామంలో ఇంత మంది కిడ్నీ సమస్యతో మృత్యువాత పడుతున్నా ఆరోగ్య ,గ్రామీణ నీటి సరఫరా అధికారులు మాత్రం పట్టనట్టు వ్యవహరించడంపై గ్రామస్తులు ఆగ్రహం చెందుతున్నారు. కొంతమంది గ్రామస్తులు కిడ్నీ సమస్య కారణంగా ప్రాణ భయంతో ఉన్న ఊరును కాదని గ్రామం విడిచి ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు. తక్షణం జిల్లా అధికారులు స్పందించి ఆర్.భీమవరంలో కిడ్నీ సమస్యపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.


