ఖరీఫ్‌ సాగు ఎలా ? | - | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌ సాగు ఎలా ?

Jun 23 2026 1:04 AM | Updated on Jun 23 2026 1:04 AM

అధ్వానంగా రిజర్వాయర్లు

కదలని పూడికతీత, కాలువ మరమ్మతు పనులు

జంగిల్‌ క్లియరెన్స్‌ చేయక దయనీయంగా సాగునీటి కాలువలు

దెబ్బతిన్న గేట్లు.. ధ్వంసమైన వాటర్‌ ఫ్లో రోప్‌లు

లీకులతో వేలాది క్యూసెక్కుల నీరు వృథా

పూడికతీతలపై చంద్రబాబు సర్కార్‌ తీవ్ర నిర్లక్ష్యం

ఆందోళనలో అన్నదాతలు

సాక్షి, అనకాపల్లి: ఖరీఫ్‌ సీజన్‌లోనైనా పంటలు బాగా పండాలని, దిగుబడి బాగా రావాలని కోటి ఆశలతో ఎదురుచూస్తున్న రైతన్నకు ప్రస్తుత పరిస్థితులు నిరాశే మిగులుస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభం కావడంతో జిల్లాలో రోజూ ఏదో ఒక చోట ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అలా కురిసే నీరు రిజర్వాయర్లలోకి చేరి, సాగునీరు పుష్కలంగా అందినప్పుడే పంటలు పండుతాయి, దిగుబడి పెరుగుతుంది. కానీ జిల్లాలో జలాశయాల పరిస్థితి ప్రస్తుతం అత్యంత దారుణంగా తయారైంది. రిజర్వాయర్ల ఆధునికీకరణ, మరమ్మతులతో పాటు సాగు నీటి కాలువల్లో పూడికతీత పనుల్లో ఎక్కడా కదలిక లేదు.

పడకేసిన మరమ్మతులు..

వృథాగా పోతున్న జలాలు

ఈ ఖరీఫ్‌ సీజన్‌లో రిజర్వాయర్ల పరిధిలో ఉన్న ఆయకట్టు శివారు భూములకు సైతం సాగునీరు అందాలంటే.. వేసవిలోనే రిజర్వాయర్‌ గేట్ల మరమ్మతులు, దెబ్బతిన్న చెక్‌ డ్యామ్‌ల పునరుద్ధరణ, సాగునీటి కాలువల్లో పూడికతీత, జంగిల్‌ క్లియరెన్స్‌ (పిచ్చిమొక్కల తొలగింపు) పనులు పూర్తి చేయాల్సి ఉంది. వేసవి ముగిసి వర్షాకాలం వచ్చేసినా.. పూడికతీత, మరమ్మతులు ఎక్కడా జరిగిన దాఖలాలు లేవు.

ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రెండు ఖరీఫ్‌ సీజన్‌లు ముగిశాయి. అయినప్పటికీ జిల్లాలో ఉన్న రిజర్వాయర్ల ఆధునికీకరణకు, సాగునీటి కాలువల పూడికతీత పనులకు మోక్షం లభించలేదు. గేట్లు, చెక్‌ డ్యామ్‌లు దెబ్బతినడంతో నిత్యం వందలాది క్యూసెక్కుల నీరు వృథాగా లీకై బయటకు పోతోంది. సాగునీటి కాలువలు కూడా పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయాయి. పూడికతీత పనులు చేపట్టకపోవడం తో నీటి విడుదల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫలితంగా శివారు భూములకు సాగునీరు సక్రమంగా అందడం లేదు.

లక్షల ఎకరాల ఆయకట్టు

జిల్లాలో ఒక భారీ నీటిపారుదల ప్రాజెక్టు(తాండవ), మూడు మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులు(రైవాడ, పెద్దేరు, కోనాం), 2,880 చెరువులు,గ్రోయిన్లు, చిన్నపాటి చెక్‌ డ్యామ్‌లున్నాయి. వీటి పరిధిలో 3,05,993 ఎకరాల ఆయకట్టు ఉంది.

వీటిలో తాండవ పరిధిలో 32,689 ఎకరాలు, మూడు మధ్య తరహా నీటి ప్రాజెక్టులు రైవాడ, పెద్దేరు, కోనాం పరిధిలో 42,725 ఎకరాలు, 2,880 చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టుల కింద 2,30,579 ఎకరాలు సాగులో ఉన్నాయి.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో

మంజూరై ప్రస్తుతం నిలిచిపోయిన పనులు

●మైనర్‌ ప్రాజెక్టులైన మాడుగల మండలం తాటిపర్తిగ్రామంలోని ఎన్టీఆర్‌ జలాశయానికి 2022లో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.21.75 కోట్లతో ప్రతిపాదనలు పంపిచారు. ప్రభుత్వం మారడంతో అవి మూలనపడిపోయాయి. ఇప్పుడు మళ్లీ రూ.5.15 కోట్లతో ప్రతిపాదనలు సమర్పించారు.

●మాడుగుల మండలం శంకరం గ్రామం వద్ద ఉరకగెడ్డ జలాశయం బ్యాలెన్స్‌ పనులను గత ప్రభుత్వంలో 2023లో రూ.14.50 కోట్లకు ప్రతిపాదించారు. వాటిని కూటమి ప్రభుత్వ ఆమోదించలేదు. పెద్దేరు

నిధుల నిలిపివేత.. ప్రభుత్వ నిర్లక్ష్యం

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టుల ఆధునికీకరణ, మరమ్మతుల కోసం నిధులను మంజూరు చేశారు. కొన్ని చోట్ల పనులు కూడా ప్రారంభమవగా, మరికొన్నింటికి టెండర్‌ ప్రక్రియ పూర్తయింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో కొన్నింటిని రద్దు చేయడమే కాకుండా, మరికొన్నింటి టెండర్లను కూడా మార్చివేసింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి నేటికి 24 నెలలు పూర్తి కావస్తున్నా.. పాలకులు ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇంతవరకు జలాశయాల పరిధిలో కాలువల పూడికతీత పనులకు, మరమ్మతులకు నిధులు కేటాయించలేదు. గత ప్రభుత్వంలో మంజూరైన పనులను కొనసాగించకుండా ఈ ప్రభుత్వం రిజర్వాయర్ల పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. గత ఏడాది వర్షాకాలంతో పాటు, నవంబరు, డిసెంబరు నెలల్లో కురిసిన వర్షాలకు ఈ జలాశయాల్లోకి భారీగా నీరు చేరినప్పటికీ, గేట్ల లీకేజీల వల్ల ఆ నీరంతా వృథాగా పోయింది. కనీసం ఈ ఖరీఫ్‌ సీజన్‌కు ముందైనా ప్రభుత్వం మరమ్మతులపై దష్టి పెడుతుందని ఆశించిన రైతాంగానికి నిరాశే మిగిలింది. ఇప్పటికై నా పాలకులు స్పందించి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టకపోతే ఈ ఏడాది కూడా పంటలు పండక రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement