సోమవారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2026
జిల్లాలో పలు ప్రైవేటు పాఠశాలలు యథేచ్ఛగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. నిబంధనలను ఉల్లంఘించి తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. తమ స్కూల్‌లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని నమ్మించి నట్టేట ముంచుతున్నాయి. పాఠశాలలపై నిఘా ఉంచాల్సిన విద్యాశాఖ అధికారులు మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో ప్రైవేటు స్కూళ్లు 401 వరకు ఉండగా, 60వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు.
యలమంచిలి రూరల్: జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. పంచాయతీల్లో 1 నుంచి 5 తరగతులకు 10 వేల వరకు, 6 నుంచి 10 తరగతులకు 12 వేల వరకు, మున్సిపాలిటీల్లో 1 నుంచి 5 తరగతులకు 11 వేలు, 6 నుంచి 10 తరగతులకు 15 వేలవరకూ వసూలు చేయాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. అయితే యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా రెట్టింపు ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీనికితోడు యూనిఫాం, పుస్తకాలు, షూ, టై పేరిట భారీగా దోపిడీ చేస్తున్నాయి. జీవో నంబర్లు 1, 53 ప్రకారం విధిగా విద్యాశాఖ నిర్ధేశించిన ప్రకారమే ఫీజులు వసూలు చేయాలి. స్కూలు ప్రాంగణాల్లో యూనిఫాం,పుస్తకాలు,బ్యాగులు,ఇతర విద్యా సామగ్రి విక్రయించకూడదు. కానీ చాలా వరకు ప్రైవేటు పాఠశాలలు జీవోలను తుంగలో తొక్కుతున్నాయి.విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ,నియంత్రణ కొరవడడంతో తాము చెప్పిందే వేదం అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. జిల్లాలో ఉన్న బడా ప్రైవేటు పాఠశాలల్లో ఎక్కువ టీడీపీ,కూటమి పార్టీల నేతలవే కావడంతో అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తున్నా విద్యాశాఖ అధికారులు నోరుమెదపడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వ్యాపార కేంద్రాలుగా..
ప్రైవేటు,కార్పొరేట్ విద్యాసంస్థలు వ్యాపార కేంద్రాలుగా మారాయి. విద్యను అంగడి సరుకుగా మార్చేసి అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. కొందరు తల్లిదండ్రులు తమ చిన్నారులను బాగా చదివించి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలనే ఆశతో ప్రైవేటు,కార్పొరేట్ స్కూళ్లవైపు అడుగులు వేస్తున్నారు.అదే అదునుగా భావించిన కొన్ని పాఠశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి.అడ్మిషన్ ఫీజు మొదలుకుని టై,షూ,బెల్టులతో పాటు పుస్తకాల వరకూ అన్నీ వారే సరఫరా చేస్తున్నారు. బహిరంగ మార్కెట్ కంటే ఎక్కువ ధరకు సామగ్రి,పుస్తకాలు,యూనిఫాం తదితరాలు విక్రయిస్తున్నారు. స్కూళ్ల పేరుతో కాకుండా వేరే పేర్లతో బిల్లులు తల్లిదండ్రులకు ఇస్తున్నారు.జీఎస్టీ భారీగా ఎగవేస్తూ లక్షల్లో దోపిడీకి పాల్పడుతున్నారు.
ప్రత్యేక బ్యాచ్‌ల పేరుతో మోసం
కార్పొరేట్,ప్రైవేట్ పాఠశాలల్లో ఒక్కో బ్రాంచ్‌లో ఒక్కో ధర ఉంటుంది.ఐఐటీ,ఈ టెక్నో,స్పార్క్ ఇలా పలు రకాల పేర్లతో అదనపు ఫీజుల వసూళ్లకు పాల్పడుతున్నారు.పాఠశాలల్లో అడ్మిషన్ల సమయంలో ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించకూడదనే నిబంధన ఉంది.అయితే పలు పాఠశాలల్లో ముందస్తుగా ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించి అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతున్నారు.విద్యార్థుల నైపుణ్యాల్లో తారతమ్యాలు సృష్టించి మానసికంగా కుంగి పోయేలా చేస్తున్నారు.ప్రత్యేకంగా నిర్వహిస్తున్న బ్యాచుల్లో ఇష్టానుసారంగా ఫీజులు దోపిడీ చేస్తున్నారు.2026–27 విద్యా సంవత్సరం ప్రారంభానికి మూడు నెలల ముందే ప్రైవేటు పాఠశాలలు ముందస్తు అడ్మిషన్లను చేపట్టినా జిల్లా విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి.
నోరు మెదపని అధికారులు
జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు,కార్పొరేట్ యాజమాన్యాల పాఠశాలలు నిర్వహిస్తున్న అడ్డగోలు ఫీజుల వసూళ్లు,పుస్తకాలు,ఇతర సామగ్రి విక్రయాల దోపిడీని జిల్లా విద్యాశాఖ అధికారులు అరికట్టాల్సి ఉంది.ఆయా పాఠశాలల్లో జరుగుతున్న దోపిడీ పర్వం విద్యాశాఖ అధికారులకు తెలిసినప్పటికీ నోరు మెదపడం లేదు.ఎంఈవోలు,డీవైఈవోలు తనిఖీలు చేయడం లేదు.ఆయా విద్యాసంస్థల నిర్వాహకులతో విద్యాశాఖ అధికారులు లాలూచి పడ్డారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.ముందస్తు అడ్మిషన్లు,అడ్డగోలు ఫీజుల వసూళ్లు,పుస్తకాల విక్రయాలపై తల్లిదండ్రులు,విద్యార్థి సంఘాల నాయకులు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అడ్డుకట్ట
ప్రైవేటు,కార్పొరేట్ విద్యాసంస్థల్లో జరుగుతున్న అడ్డగోలు వసూళ్లు, అక్రమాలకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది.ప్రత్యేకంగా ఫీజు నియంత్రణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేకంగా జీవో నంబరు 53 ను జారీ చేసింది.ఎక్కడైనా తల్లిదండ్రులు ప్రైవేటు,కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీపై ఫిర్యాదు చేస్తే నేరుగా ఆయా పాఠశాలల్లో కమిషన్ సభ్యులు,అధికారులు తనిఖీలు చేపట్టేవారు.
రెట్టింపు ఫీజులు.. వేలల్లో పుస్తకాల ఖర్చులు
జీవోలు కాగితాలకే పరిమితం
మామూళ్ల మత్తులో అధికారులు
కూటమి నేతల అండతో స్కూళ్ల ఇష్టారాజ్యం
తల్లిదండ్రులు విలవిల
అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు
ప్రైవేటు స్కూళ్లలో పుస్తకాలు,యూనిఫాం,ఇతర సామగ్రి అమ్మకాలు చేయకూడదు. ఫీజుల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు ఫిర్యాదులొస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. పుస్తకాల అమ్మకాల విషయంలో తల్లిదండ్రులు నేరుగా మాకు ఫిర్యాదు చేయవచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ఉచితంగా అందిస్తున్నాం.తల్లిదండ్రులు దానిని సద్వినియోగపర్చుకోవాలి.ప్రైవేటు స్కూళ్లలో పుస్తకాల విక్రయాలపై ఎంఈవోలు తనిఖీలు చేయాలని ఆదేశించాం.
– గిడ్డి అప్పారావు నాయుడు, డీఈవో,అనకాపల్లి


