ఘనంగా యోగా డే | - | Sakshi
Sakshi News home page

ఘనంగా యోగా డే

Jun 22 2026 12:48 AM | Updated on Jun 22 2026 12:48 AM

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లావ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొని సామూహికంగా యోగాసనాలు వేశారు. యోగా అనేది ఆరోగ్య మంత్రం అని ప్రతి ఒక్కరూ నిత్యం పాటించాలని నేతలు సూచించారు.

యోగా.. జీవన శైలిలో భాగం కావాలి

తుమ్మపాల: యోగాను ప్రతిఒక్కరూ తమ జీవన శైలిలో భాగంగా చేసుకోవాలని కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం అనకాపల్లి మండలం శంకరంలో గల బొజ్జన్నకొండ వద్ద యోగాంధ్ర – 2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగాతో మానసిక ప్రశాంతత, ఒత్తిడి లేని సంతోషకరమైన కుటుంబ జీవనం సాధ్యమవుతుందన్నారు. ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ధ్యానం ఎంతో అవసరమన్నారు. యోగా ద్వారా మానసిక సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు. మన మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా, మన చుట్టూ ఉన్నవారిని కూడా సంతోషంగా ఉంచవచ్చన్నారు. ప్రతిరోజూ కనీసం అరగంట సమయం యోగాకు కేటాయించాలని చెప్పారు. ముందుగా తల్లిదండ్రులు యోగా సాధన చేస్తేనే, వారిని చూసి పిల్లలు కూడా అలవర్చుకుంటారన్నారు. అందరూ యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకుని,ఒత్తిడి లేని, ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన కుటుంబ వ్యవస్థకు, సమాజ నిర్మాణానికి కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ పాఠశాలల్లో యోగా విధిగా అమలు చేయాలన్నారు. రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో అనకాపల్లి జిల్లా బృందం ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమని చెప్పారు. అంతకుముందు రాష్ట్ర, జిల్లా స్థాయి యోగా పోటీల విజేతలకు విశిష్ట సేవలు అందించిన యోగా గురువులకు అతిథుల చేతుల మీదుగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement