బోయపాడులో మాట్లాడుతున్న ఆర్‌డీవో రమణ
నక్కపల్లి: మండలంలో బోయపాడు తీరంలో చనిపోయిన చేపలను అడ్డురోడ్డు ఆర్‌డీవో వి.వి. రమణ శనివారం పరిశీలించారు. టన్నుల కొద్దీ చేపలు చనిపోయి ఒడ్డుకు చేరిన విషయం తెలుసుకున్న ఆయన బోయపాడు తీరానికి వెళ్లి పరిశీలించారు. స్థానిక మత్స్యకారులతోమాట్లాడారు.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు, మత్స్యకార నాయకులు మహేష్ తదితరులు మాట్లాడుతూ హెటెరో కంపెనీ వారు పైపులైన్ల ద్వారా వ్యర్థ రసాయనాలు సముద్రంలోకి విడుదల చేయడం వల్లే చేపలు మృత్యువాత పడ్డాయని ఆరోపించారు. గతంలోకూడా పలు మార్లు ఇలాంటి ఘటనలు జరిగాయని, అధికారులు సరైన నివేదికలు ఇవ్వకుండా కంపెనీకి వత్తాసు పలుకుతున్నారన్నారు. తక్షణమే ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, బాధ్యులైన కంపెనీల యజమానులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈఘటనపై నిష్పాక్షికంగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని ఆర్‌డీవో రమణ హామీ ఇచ్చారు.


