న్యూస్‌రీల్
జిల్లాలో తీరప్రాంతం కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. పరిశ్రమలు రసాయన వ్యర్థాలను నేరుగా సముద్రంలోకి విడిచిపెడుతుండడంతో కాలుష్యకాసారంగా మారుతోంది. ఫార్మా, ఇతర రసాయన కంపెనీల వ్యర్థాలు జలచరాలను మింగేస్తున్నాయి. దీంతో తరచూ తీరం వెంబడి గుట్టలుగుట్టలుగా చేపలు చనిపోతున్నాయి. ఎటు చూసినా మృతి చెందిన మత్స్య సంపదే కనిపిస్తుండడం మత్స్యకారులను, పర్యావరణ ప్రేమికులను కలవరపెడుతోంది.
ఆదివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2026
తీరంలో
సాక్షి, అనకాపల్లి: పారిశ్రామిక ప్రాంతమైన పాయకరావుపేట నుంచి పరవాడ వరకు గల సుదీర్ఘ తీర ప్రాంతంలో పారిశ్రామిక కాలుష్యం జలచరాల పాలిట శాపంగా మారింది. ఫార్మా కంపెనీల నుంచి వెలువడుతున్న విషపూరిత రసాయన వ్యర్థాలను శుద్ధి చేయకుండా నేరుగా సముద్రంలోకి విడిచిపెడుతుండటంతో లక్షలాది చేపలు మృత్యువాత పడుతున్నాయి. దీంతో జిల్లాలోని తీర ప్రాంతంలో వేటపైనే ఆధారపడి జీవిస్తున్న సుమారు 12,844 మత్స్యకార కుటుంబాల జీవనోపాధికి విఘాతం కలుగుతోంది. మరోవైపు పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించే అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు సైతం ఈ రసాయన కోరల్లో చిక్కుకుని ప్రాణాలు విడుస్తున్నాయి. నక్కపల్లి మండలంలోని బోయపాడు సముద్రతీరంలో శనివారం చనిపోయిన వేలాది చేపలు ఒడ్డుకు కొట్టుకురావడం తీవ్ర కలకలం రేపింది. రాజయ్యపేట నుంచి బోయపాడు తీరం వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర క్వింటాళ్ల కొద్దీ చేపలు చనిపోయి కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. సమీపంలోని రసాయన పరిశ్రమల యాజమాన్యాలు రహస్యంగా సముద్రంలోకి పైప్‌లైన్లు వేసి, నిబంధనలకు విరుద్ధంగా వ్యర్థాలను వదలడమే ఇందుకు కారణమని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఇలా మత్స్య సంపద నాశనమవుతుంటే ప్రతిరోజూ వేటకు వెళ్తేనే గాని ఇల్లు గడవని తమ పరిస్థితి ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెంటకోట నుంచి ఉప్పుటేరు వరకు వేలాది మంది మత్స్యకారులు సముద్రంపైనే ఆధారపడి బతుకుతున్నారు.
గతంలో ఉప్పుటేరులో ...
పరిశ్రమల నిర్లక్ష్యం ఈనాటిది కాదు. గత ఏడాది జూన్ 16న అచ్యుతాపురం పూడిమడక ఉప్పుటేరు (మొగ) వద్ద కూడా ఇదే తరహాలో చేపలు మరణించాయి. అచ్యుతాపురం సెజ్ పరిధిలోని 200కు పైగా ఫార్మా, ఇతర రసాయన కంపెనీల నుంచి వెలువడిన కలుషిత వ్యర్థాలను నేరుగా సముద్రంలోకి వదలడంతో లక్షలాది చేపలు చనిపోయాయి. ఆ సమయంలో స్థానిక మత్స్యకారులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (ఏపీపీసీబీ) అధికారులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి శాశ్వత చర్యలు తీసుకోకపోవడం వల్లే నేడు మళ్లీ బోయపాడులో ఈ పరిస్థితి పునరావృతమైందని స్థానికులు మండిపడుతున్నారు. నిబంధనల ప్రకారం ఫార్మా కంపెనీల నుంచి వచ్చే ప్రమాదకర ద్రవ వ్యర్థాలను ఈటీపీ పద్ధతిలోనూ, ఘన వ్యర్థాలను రీసైక్లింగ్ ప్రక్రియ ద్వారాను వాటి స్వభావాన్ని బట్టి పూర్తిగా శుద్ధి చేయాలి. ఆ తర్వాతే సురక్షితంగా సముద్రంలోకి వదలాలి. కానీ, వ్యర్థాల నిర్వహణ ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీలు ప్రమాదకర రసాయనాలను నేరుగా సముద్రపు నీటిలో కలిపేస్తున్నాయి.
జలచరాలను కబళిస్తున్న కాలుష్యం పెద్ద సంఖ్యలో చనిపోతున్న చేపలు తరచూ గుట్టలుగా దర్శనమిస్తున్న వైనం మీనాల మృతిపై మత్స్యకారుల ఆందోళన ఫార్మా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఏపీపీసీబీ, ఏపీఐఐసీకి విన్నవించుకున్నా ఫలితం శూన్యమంటున్న గంగపుత్రులు
కనుమరుగవుతున్న అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు
దేశంలోనే అరుదైన ఆలివ్ రిడ్లే ఆడ తాబేళ్లు ఏటా డిసెంబర్ నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో ఒడిశా, ఆంధ్ర తీర ప్రాంతాలకు గుడ్లు పెట్టడానికి వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి వస్తుంటాయి. గతంలో మార్చి నెలలో పూడిమడక తీరానికి వచ్చిన వందలాది తాబేళ్లు ఈ రసాయన వ్యర్థాల ధాటికి తట్టుకోలేక మృత్యువాత పడ్డాయి. పర్యావరణాన్ని కాపాడే ఈ జీవులు కాలుష్యానికి బలి అవుతున్నా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


