జిల్లాలో 107 | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో 107

Jun 21 2026 12:31 AM | Updated on Jun 21 2026 12:31 AM

● 1,200 మంది గరిష్ట ఓటర్ల ప్రామాణికంగా ఏర్పాటు ● ప్రస్తుత పోలింగ్‌ కేంద్రాలు 1529 ● ఇన్‌చార్జి డీఆర్‌వో శ్రీనివాసరావు

కొత్త పోలింగ్‌ కేంద్రాలు

వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశంలో మాట్లాడుతున్న ఇన్‌చార్జి డీఆర్‌ వో శ్రీనివాసరావు చిత్రంలో ఎలక్షన్‌ సెల్‌ సూపరింటెండెంట్‌ వాసునాయుడు

సాక్షి, అనకాపల్లి: కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) ఆదేశాల మేరకు జిల్లాలో పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ(రేషన్‌లైజేషన్‌) ప్రక్రియను చేపట్టారు. పోలింగ్‌ స్టేషన్ల హద్దులు, లొకేషన్లు, పేర్ల మార్పులపై గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట అదనపు పోలింగ్‌ కేంద్రాలు అవసరమని తేల్చారు. కొత్తగా 107 కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయంలో ఇన్‌చార్జి డీఆర్‌వో వై.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గుర్తింపు పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా మార్పులు చేర్పులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసే క్రమంలో ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో గరిష్ట ఓటర్ల సంఖ్యను 1,200 గా ప్రామాణికంగా తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పోలింగ్‌ కేంద్రాల భవనాలు శిథిలావస్థకు చేరినా లేదా కూల్చివేసినా.. వాటి స్థానంలో అదే ప్రాంతంలో లేదా సమీప ప్రాంతంలో కొత్త భవనాలను పోలింగ్‌ కేంద్రాలుగా(ఈఆర్‌వో/ ఏఈఆర్‌వో) అధికారులు ప్రతిపాదించారు.

అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో మార్పులు

అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో ఈఆర్‌వో ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి, వివరాలను నమోదు చేసుకుని, ప్రతిపాదిత మార్పులు, పేర్ల మార్పు, కొత్త కేంద్రాల జాబితాను అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేసి, వారి నుంచి సలహాలు, అభ్యంతరాలను కోరారు. మొత్తం ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈఆర్‌వోల నుంచి అందిన ప్రతిపాదనల ప్రకారం లొకేషన్‌ , పేర్ల మార్పు, కొత్త పోలింగ్‌ కేంద్రాల వివరాలు తెలియజేశారు.

1,636కి చేరిన పోలింగ్‌ కేంద్రాలు

జిల్లాలో ప్రస్తుతం 1,529 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా.. హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ సంఖ్య 1,636 కి చేరింది. అంటే జిల్లా వ్యాప్తంగా కొత్తగా 107 కొత్త పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించారు. వివిధ కారణాల రీత్యా మొత్తం 6 కేంద్రాల లొకేషన్లను మార్చగా, భవనాల మార్పుల కారణంగా 55 కేంద్రాల పేర్లను సవరించారు. అత్యధికంగా నర్సీపట్నం నియోజకవర్గంలో 43 కేంద్రాల పేర్లను మార్చగా.. అత్యధికంగా చోడవరం నియోజకవర్గంలో 29 కొత్త పోలింగ్‌ కేంద్రాలను ప్రతిపాదించారు.

పోలింగ్‌ కేంద్రాల ప్రతిపాదనలు ఇవే..

●చోడవరం నియోజకవర్గంలో 243 పోలింగ్‌ స్టేషన్లకు అదనంగా మరో 29 ప్రతిపాదించి, మొత్తం 272 పోలింగ్‌ స్టేషన్లుగా ఆమోదించారు.

●మాడుగుల నియోజకవర్గంలో 235 పోలింగ్‌ స్టేషన్లకు అదనంగా మరో 3 ప్రతిపాదించి, మొత్తం 238 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు

●అనకాపల్లి నియోజకవర్గంలో 251 పోలింగ్‌ స్టేషన్లకు అదనంగా మరో 24 ప్రతిపాదించి, మొత్తం 275 పోలింగ్‌ స్టేషన్లుగా ఆమోదించారు.

●యలమంచిలి నియోజకవర్గంలో 246 పోలింగ్‌ స్టేషన్లకు అదనంగా మరో 20 ప్రతిపాదించి, మొత్తం 266 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు.

●పాయకరావుపేట నియోజకవర్గంలో 292 పోలింగ్‌స్టేషన్లకు అదనంగా మరో 20 ప్రతిపాదించి, మొత్తం 312 పోలింగ్‌ స్టేషన్లుగా ఆమోదించారు.

●నర్సీపట్నం నియోజకవర్గంలో 262 పోలింగ్‌ స్టేషన్లకు అదనంగా మరో 11 ప్రతిపాదించి, మొత్తం 273 పోలింగ్‌ స్టేషన్లుగా ఆమోదించారు.

ఓటరుకు ఓటు హక్కును సులభతరం చేసేందుకే

ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో 1200 ఓట్లు ప్రాతిపదికన తీసుకుంటే ఓటరు తన ఓటుహక్కును వినియోగించుకునేందుకు మరింత సులభతరంగా మారుతుందనే ఈ హేతుబద్ధీకరణ ప్రక్రియతో పోలింగ్‌ కేంద్రాలు పెంపునకు ప్రతిపాదనలు చేశామని ఇన్‌చార్జి డీఆర్‌వో వై.శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల అంగీకారంతోనే ఈ ప్రతిపాదనలు పంపించామన్నారు. ‘సర్‌’ ప్రక్రియలో ఎటువంటి అభ్యంతరాలున్నా తమ దృష్టికి తీసుకురావాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. అనంతరం వారి నుంచి క్షేత్రస్థాయిలో ఓటరు సవరణ ప్రక్రియలో సమస్యలను, అసౌకర్యాలను అడిగితెలుసుకున్నారు. ఈ సమీక్ష సమావేశంలో వైఎస్సార్‌ సీపీ నుంచి ఉత్తరాంధ్ర జోన్‌–1 మహిళా విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఈర్లె అనురాధ, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు బొడ్డెపల్లి హేమంత్‌కుమార్‌తో పాటు ప్రతీ నియోజకవర్గం నుంచి ఇద్దరి చొప్పున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్‌ సెల్‌ సూపరింటెండెంట్‌ వాసునాయకుడు, ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, వివిధ రాజకీయ పార్టీల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement