గొలుగొండ: పకడ్బందీగా రీ సర్వే నిర్వహించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. మండలంలో కృష్ణదేవి పేట అల్లూరి పార్కులో శనివారం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన జరిపారు. కొత్తమల్లంపేట రెవెన్యూ పరిధి లింగంపేటలో నిర్వహిస్తున్న రీ సర్వే పనులను ఆమె పరిశీలించారు. రీసర్వే పనులు సక్రమంగా ఉండాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.అక్కడ నుంచి గొలుగొండ వస్తూ మార్గమధ్యంలో బూరుగుమాను చెరువులో ఉపాధి హామీ పథకం కూలీలతో సమావేశం నిర్వహించారు. పనులు సక్రమంగా నిర్వహిస్తే గిట్టుబాటు ధరలు వస్తాయని తెలిపారు. ముందుగా గొలుగొండలో నిర్వహించిన స్వచ్ఛంధ్రా–స్వర్ణాంధ్రా కార్యక్రమంలో పాల్గొన్నారు. యూపీ పాఠశాల వద్ద ఆమె స్వయంగా చెత్త సేకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ సందర్భంగా మండలం కేంద్రం గొలుగొండకు చెందిన పారిశుధ్య కార్మికులు కలెక్టర్‌ను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. కనీసం వేతనం రూ.10వేలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.
పనికి తగిన కూలి రావడం లేదు
ఉపాధి పనులకు వెళ్లినా తగిన కూలి రావడంలేదని కలెక్టర్ విజయ్‌కృష్ణన్, జాయింట్ కలెక్టర్‌కు స్థానిక ఉపాధి కూలీలు మొరపెట్టుకున్నారు. రోజుకు కనీసం రెండు వందలు కూడా రావడం లేదని వారు చెప్పారు. కూలి పెరిగే విధంగా పనులు చేయించాలని స్థానిక అధికారులకు కలెక్టర్ సూచించారు. నర్సీపట్నం ఆర్‌డీవో వి.వి. రమణ, తహసీల్దార్ వి. శ్రీనివాసరావు, ఎంపీడీవో శ్రీనువాసరావు, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమానికి కృషి
అనకాపల్లి: రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. రెవెన్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తూరు ఆర్టీవో కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో టెన్త్, ఇంటర్మీడియెట్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన రెవెన్యూ ఉద్యోగుల పిల్లలకు స్కాలర్ షిప్పులు, సర్టిఫికెట్లు అందజేశారు. అంతకుముందు ఎన్టీఆర్ ఆస్పత్రిలో నిర్వహించిన రెవెన్యూ ఉద్యోగుల రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశనుంచి ఉన్నత శిఖరాలను అధిరోహించేందకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. అనంతరం విధి నిర్వహణలో ఉంటూ మరణించిన రెవెన్యూ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం శ్రీ సాయి నాట్య భారతి అకాడమీ చిన్నారులు నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. జేసీ శౌర్యమాన్ పటేల్, డిప్యూటీ కలెక్టర్, రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


