● వానాకాలం ముంచుకొస్తున్నా మందకొడిగానే పనులు
● 118 పనులకు గాను 18 మాత్రమే పూర్తి
● బిల్లులు అందక కాంట్రాక్టర్ల నిరాసక్తత
● కానరాని పనుల పురోగతి
● సాగునీటిపై అన్నదాతల ఆందోళన
సాక్షి, అనకాపల్లి: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత పథకాలకు పేర్లు మార్చి ప్రచారం చేసుకోవడంపై ఉన్న శ్రద్ధ, క్షేత్రస్థాయిలో పనుల నిర్వహణపై పెట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రైతులకు మేలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసిన సాగునీటి పనులనే, ఇప్పుడు కొద్దిగా రంగులు అద్ది తమ ఖాతాలో వేసుకునేందుకు పాలకులు తాపత్రయపడుతున్నారు. అయితే, ప్రచార ఆర్భాటం తప్ప పనుల్లో మాత్రం ఎలాంటి పురోగతీ కనిపించడం లేదు. జలవనరుల శాఖ నర్సీపట్నం డివిజన్ పరిధిలో సాగు నీటి కాలువల మరమ్మతులు, గొలుసుకట్టు చెరువుల ఆధునికీకరణ పనుల పురోగతి చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. వర్షాకాలం ముంచుకొస్తున్నా పనులు నత్తనడకన సాగుతుండడంతో ఆయకట్టు రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
పేరు మార్పుపై శ్రద్ధ.. పనులపై నిర్లక్ష్యం
గత ప్రభుత్వ హయాంలో చెరువుల ఆధునికీకరణ ద్వారా ప్రతీ చినుకునూ ఒడిసి పట్టేలా ప్రణాళికలు రూపొందించగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం దానికి ‘జలధార– జలహారతి’ అంటూ కొత్త పేరు తగిలించి ప్రచారానికి తెరలేపింది. ప్రతీ నీటి బొట్టును ఒడిసిపట్టి పరిరక్షించుకోవాలి. వ్యవసాయానికి అనుకూలంగా..ఆత్మబంధువుగా మలుచుకోవాలి. శివారు పంటపొలాలు సైతం నీరు లేక ఎండిపోయే పరిస్థితి ఉండకూడదన్నదే లక్ష్యంగా గత ప్రభుత్వంలో ‘ఏపీ సమీకృత సాగునీరు వ్యవసాయ పరివర్తన పథకం’ను తీసుకొచ్చింది. గ్రామాల్లో వ్యవ‘సాయం’గా ఉండే చెరువుల్లో వర్షాలు పడేటప్పుడు నీరు నిల్వ ఉండేందుకు వాటిని ఆధునీకరించడం, చెరువుల అభివృద్ధి నిర్మాణ పనుల చేయడం ఈ పథకంలో భాగం. ఒక్కో చెరువును రూ.30 లక్షల నుంచి రూ.60 లక్షల అంచనా వ్యయంతో అభివృద్ధి చేశారు. ఇలా గత ప్రభుత్వ హయాంలో 42కు పైగా చెరువులను ఆధునీకరించారు.
బిల్లులు చెల్లించకపోవడమే ...?
పనుల్లో ఇంతటి జాప్యానికి ప్రధాన కారణం గతంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడమేనని తెలుస్తోంది. గత ఏడాది చేసిన సాగునీటి పనులకు సంబంధించిన నిధులను ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయలేదు. ‘గత ఏడాది చేసిన పనులకే ఇంకా మోక్షం లభించలేదు.. ఇప్పుడు చేస్తున్న పనులకు బిల్లులు ఎప్పుడు ఇస్తారో, అసలు ఇస్తారో లేదో?!‘ అని సాగునీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షులు, కాంట్రాక్టర్లు తీవ్ర అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. పాత బాకీలు తేల్చకుండా కొత్త పనులు ఎలా చేయాలంటూ ప్రశ్నిస్తూ వారు తాత్సా రం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఎన్ని ఆదేశాలిచ్చినా, క్షేత్రస్థాయిలో పనులు ముందుకు సాగకపోవడానికి ఈ బిల్లుల చిక్కే ప్రధాన కారణం.
జిల్లాలో జలధార–జలహారతి కార్యక్రమం కింద చేపట్టాల్సిన పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. 118 పనులకు గాను 18 పనులు మాత్రమే పూర్తయ్యాయి. వర్షాలు కురవక ముందే ఈ పనులు పూర్తి చేయాల్సి ఉన్నా ముందుకు సాగడం లేదు. బిల్లులు చెల్లించకపోవడం వల్లే కాంట్రాక్టర్లు నిరాసక్తత చూపుతున్నారని తెలుస్తోంది.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 18 చోట్లే పూర్తి
నర్సీపట్నం డివిజన్ పరిధిలో సాగు నీటి కాలువల మరమ్మతులు, అభివృద్ధి పనుల కోసం మే 2న చంద్రబాబు ప్రభుత్వం రూ.85.6 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో డివిజన్ వ్యాప్తంగా 118 చోట్ల పనులు ప్రారంభించారు. నిధులైతే కాగితాలపై కనిపిస్తున్నాయి కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం పనుల పురోగతి శూన్యంగా మారింది. మంజూరైన 118 పనుల్లో ఇప్పటివరకు కేవలం 18 చోట్ల మాత్రమే పనులు పూర్తి కావడం గమనార్హం.తాండవ జలాశయం ప్రాజెక్టు పరిధిలోని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి రూ.30 లక్షలతో ఐదు పనులు, తుని నియోజవర్గానికి రూ.27 లక్షలతో నాలుగు పనులు మంజూరయ్యాయి. ఇక్కడ పనులైతే ప్రారంభించారు కానీ, నేటికీ ఒక్కటంటే ఒక్క పని కూడా పూర్తి కాలేదు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ నెలాఖరుకు అన్ని పనులూ పూర్తి కావాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే జూలై నెలాఖరుకై నా ఇవి పూర్తవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కలెక్టర్ ఇచ్చిన గడువు ముగుస్తున్నా..
రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురవక ముందే ఈ పనులన్నీ త్వరితగతిన పూర్తిచేస్తేనే ఆయకట్టుదారులకు ఉపయోగకరంగా ఉంటుంది. వర్షాలు పడితే కాలువలు, చెరువుల్లో నీరు చేరి పనులు చేయడం అసాధ్యంగా మారుతుంది. ఈ విషయాన్ని గమనించిన కలెక్టర్.. జులై 7 నాటికి గొలుసుకట్టు చెరువుల పనులన్నీ పూర్తికావాలని స్పష్టమైన లక్ష్యాయన్ని నిర్దేశించారు. ఎప్పటికప్పుడు పనులపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే కలెక్టర్ విధించిన గడువు లోపు పనులు పూర్తి కావడం అసాధ్యమని స్పష్టమవుతోంది.
నిలిచిన గొలుసుకట్టు పనులు
ఒకదానిపై ఒకటి ఆధారపడే గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి కోసం ప్రభుత్వం 49 చోట్ల పనులను చేపట్టింది. ఇందుకోసం రూ.2.81 కోట్లు కేటాయించారు. గొలుసుకట్టు చెరువుల కాలువలను బాగు చేయడం, పాడైన పొర్లుకట్టలను పునరుద్ధరించడం, అవసరమైన చోట్ల పాతవాటిని పటిష్టం చేయడం, రావణాపల్లి జలాశయ గట్టు తొలగించి కొత్తవి నిర్మించడం వంటి కీలకమైన పనులు ఈ నిధులతో జరగాల్సి ఉంది. అయితే అధికారుల ఉదాసీనత, పాలకుల పట్టింపులేమి కారణంగా నాలుగు చెరువులకు టెండర్లు వేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో రెండోసారి పిలిచిన టెండర్లను ఇంకా తెరవాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం నాలుగు చోట్ల మాత్రమే ఈ పనులు పూర్తయ్యాయి. మిగతావన్నీ ఇంకా పురోగతిలోనే ఉన్నాయని అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం అడుగులు ముందుకు పడటం లేదు.


