తాండవలో పుష్కలంగా నీటి నిల్వలు | - | Sakshi
Sakshi News home page

తాండవలో పుష్కలంగా నీటి నిల్వలు

Jun 19 2026 12:36 AM | Updated on Jun 19 2026 12:36 AM

ప్రాజెక్టు డీఈ అనురాధ

నాతవరం: తాండవ రిజర్వాయర్‌లో ఈఏడాది నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయని తాండవ ప్రాజెక్టు డీఈ అనురాధ తెలిపారు. మండలంలో గునుపూడి పైలవాని ట్యాంకు వద్ద జరుగుతున్న తాండవ కాలువ స్లూయిజ్‌ పనులను గురువారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో వరి నాట్లు వేసేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు. తాండవ ప్రమాదస్థాయి నీటి మట్టం 380 అడుగులు కాగా, గురువారం సాయంత్రానికి 374.5 అడుగుల నీరు ఉందన్నారు. నీటిని ఆయకట్టుకు విడుదల చేసే సమయానికి ప్రధాన కాలువల అభివృద్ధి పూర్తిచేస్తామన్నారు. జలధార పథకంలో రూ.8 లక్షల వ్యయంతో గునుపూడి వద్ద స్లూయిజ్‌ పనులు చేస్తున్నట్టు చెప్పారు. ఈకార్యక్రమంలో జేఈ శ్యామ్‌కుమార్‌, వర్కు ఇన్‌స్పెక్టరు నాగబాబు గునుపూడి నీటి సంఘం అధ్యక్షుడు సబ్బవరపు దేముడు పాల్గొన్నారు.

పెద్దేరులో పెరుగుతున్న నీటిమట్టం

మాడుగుల: మండలంలోని పెద్దేరు జలాశయం కేచ్‌మెంట్‌ ఏరియాలో నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో జలాశయంలోకి 25 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో జలాశయంలో నీటి మట్టం పెరుగుతోంది. కేచ్‌మెంట్‌ ఏరియాలో గురువారం 28 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదైంది. జలాశయ గరిష్ట నీటిమట్టం 137 మీటర్లు కాగా, ప్రస్తుతం 133.30 మీటర్లకు చేరుకుంది. దీంతో ఖరీఫ్‌లో వరి సాగుకు ఢోకా ఉండదని ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెద్దేరు జలాశయం ఆయకట్టు పరిధిలో 15 వేల ఎకరాల్లో వరి సాగు చేయడానికి రైతులు నారు మడులు సిద్ధం చేసుకుంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement