నిర్దేశిత లక్ష్యాలు సాధించాలి | - | Sakshi
Sakshi News home page

నిర్దేశిత లక్ష్యాలు సాధించాలి

Jun 19 2026 12:36 AM | Updated on Jun 19 2026 12:36 AM

కలెక్టర్‌ విజయకృష్ణన్‌

తుమ్మపాల: జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ ప్రాధాన్యత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో నిర్దేశిత లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గురువారంజిల్లా, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పీజీఆర్‌ఎస్‌కు అందుతున్న అర్జీలను సంబంధిత మండలాలకు వెంటనే పంపించి, వాటి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాలను గుర్తించి, అక్కడి ప్రజలను అవసరమైతే సమీప సచివాలయాలు, పాఠశాలలు, ఇతర షెల్టర్లకు తరలించేలా ముందస్తు మ్యాపింగ్‌ పూర్తి చేయాలని సూచించారు.షెల్టర్లలో ఆశ్రయం పొందే ప్రజలకు ఆహారం, తాగునీరు, విద్యుత్‌, ఫ్యాన్లు, లైట్లు తదితర అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ–కేవైసీ, మన మిత్ర, క్రాప్‌ బుకింగ్‌, ఓడీఎఫ్‌ గ్రామాలు, డీఆర్‌డీఏ కార్యక్రమాలు, స్వచ్ఛాంధ్ర తదతర ప్రభుత్వ కార్యక్రమాల పురోగతిని సమీక్షించి, నిర్ణీత గడువులో లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. గృహ నిర్మాణాలు, పీఎం సూర్య ఘర్‌ యోజనలో నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ ఓడీఎఫ్‌ హోదాను కొనసాగించేలా చర్యలు చేపట్టాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌, డిప్యూటీ కలెక్టర్‌ సుబ్బలక్ష్మి, ఇనన్‌చార్జి డీఆర్‌వో వై. శ్రీనివాస్‌తో పాటు జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement