అచ్యుతాపురం రూరల్: పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థ రసాయనాల కారణంగా పూడిమడక ఉప్పుటేరులో విలువైన మత్స్య సంపద మరణిస్తున్నట్టు మత్స్యకార నాయకుడు చేపల తాతయ్యలు తెలిపారు. ఉప్పుటేరులో సుమారు టన్నున్నర చిన్న చేపలు గురువారం మృతి చెందినట్టు ఆయన చెప్పారు. పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్య వ్యర్థాలను శుద్ధి చేయకుండా ఉప్పుటేరు కాలువ ద్వారా నేరుగా సముద్రంలోకి విడుదల చేయడం వల్ల చేపలు మరణిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. పరిశ్రమల వ్యర్థాలను అనధికారికంగా కాలువల ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


