‘మన రిజిస్ట్రేషన్‌–మన బాధ్యత’తో రిజిస్ట్రేషన్‌ సేవలు చేరువ | - | Sakshi
Sakshi News home page

‘మన రిజిస్ట్రేషన్‌–మన బాధ్యత’తో రిజిస్ట్రేషన్‌ సేవలు చేరువ

May 13 2026 12:50 AM | Updated on May 13 2026 12:50 AM

● నిషేధిత భూములు, సర్వర్‌ సమస్యలు, మార్కెట్‌ విలువలపై అర్జీలు

సబ్బవరం: రిజిస్ట్రేషన్‌ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి మన రిజిస్ట్రేషన్‌–మన బాధ్యత కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ జి.బాలకృష్ణ అన్నారు. స్థానిక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా రిజిస్ట్రార్‌ కె.మన్మధరావు, సబ్‌ రిజిస్ట్రార్‌ జిలానీబేగంతో కలిసి ప్రజల నుంచి పలు సమస్యలపై వినతులు స్వీకరించారు. నిషేధిత భూములు, ఇనాం భూములు, సర్వర్‌ సమస్యలు, అధిక మార్కెట్‌ విలువల నిర్ణయంపై ప్రజలు అర్జీలు దాఖలు చేశారు. రిజిస్ట్రేషన్‌ సేవల వికేంద్రీకరణ, సందేహాల నివృత్తి, సలహాలు, సూచనల స్వీకరణ, సమస్యల పరిష్కారంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ ఆరిపాక ప్రాంతంలోని మారుమూల భూములకు అధిక మార్కెట్‌ విలువలు నిర్ణయించారని, వాటిని తగ్గించాలని కోరారు. పైడివాడ అగ్రహారం మాజీ సర్పంచ్‌ దాసరి వెంకటరమణ మాట్లాడుతూ గ్రామంలోని లే అవుట్‌ భూములను తిరిగి రైతులు ఆక్రమించడంతో రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోయాయన్నారు. దీనిపై స్పందించిన అధికారులు ఆర్డీవో కోర్డులో కేసులు దాఖలు చేయాలని సూచిస్తూ అవసరమైన మార్గదర్శకాలు అందిస్తామని భరోసానిచ్చారు. రిజిస్ట్రేషన్‌ రైటర్స్‌ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రటరీ శేఖరమంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ వారంలో రెండు మూడు రోజులు సర్వర్‌లు పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. దీనిపై జిల్లా రిజిస్ట్రార్‌ స్పందిస్తూ ఇతర శాఖల సర్వర్‌ సమస్యలు, ఆధార్‌ సీడింగ్‌ లోపాల వల్ల ఈ సమస్య వస్తోందని, సంబంధిత శాఖల దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. అనకాపల్లి జిల్లాలో ప్రతి మంగళవారం, శుక్రవారం షెడ్యూల్‌ ప్రకారం అన్ని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ‘మన రిజిస్ట్రేషన్‌–మన బాధ్యత’కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement