అట్టుడికిన దుప్పితూరు | - | Sakshi
Sakshi News home page

అట్టుడికిన దుప్పితూరు

May 3 2026 7:41 AM | Updated on May 3 2026 7:41 AM

పోలీసుల బూట్ల చప్పుళ్లు.. బాధితుల ఆక్రందనలు, అరుపులు, కేకలు, క్షతగాత్రుల రోదనలు, గ్రామస్తుల నినాదాలతో దుప్పితూరు గ్రామం శనివారం రణరంగాన్ని తలపించింది. తమ భూములకు సరైన నష్ట పరిహారం, ప్యాకేజీ చెల్లించి, ఉద్యోగాలు కల్పించాలని కోరిన పాపానికి బ్రాండిక్స్‌ యాజమాన్యం, ఏపీఐఐసీ అధికారులు పోలీసులతో ఉక్కుపాదం మోపడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తమపై దౌర్జన్యం చేసి, అక్రమంగా అరెస్టులు చేశారని ఆ గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు.

అచ్యుతాపురం రూరల్‌: మండలంలో దుప్పితూరులో శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోయిన భూములకు పరిహారం అడిగిన పాపానికి గ్రామస్తులపై పోలీసులు రెచ్చిపోయారు. వృద్ధులు, మహిళలు అని చూడకుండా దౌర్జన్యంగా ఈడ్చిపడేశారు. సుమారు వంద మందిని వ్యాన్‌ల్లోకి బలవంతంగా ఎక్కించి పలు పోలీసు స్టేషన్లకు తిప్పారు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అచ్యుతాపురం పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. రోడ్డుపై బైఠాయించి బ్రాండిక్స్‌ యాజమాన్యం, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమ భూములను అతి తక్కువ ధరకు తీసుకుని సరైన ప్యాకేజీ, పునరావాసం, స్థానికులకు బ్రాండిక్స్‌ పరిశ్రమలో ఉద్యోగాలు ఇవ్వకుండా గ్రామంలో గోడ నిర్మాణపు పనులు చేపట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఆరు నెలలుగా గ్రామం చుట్టూ గోడ నిర్మించేందుకు బ్రాండిక్స్‌ యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. తమకు పరిహారం చెల్లించడంతో పాటు పునరావాసం, ఉపాధి కల్పించిన తరువాతే గోడ నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై పలుమార్లు ఆందోళన చేయడంతో పాటు అధికారులకు అర్జీలు అందజేశారు. అయినా యాజమాన్యం పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు, సుమారు 500 మంది పోలీసుల రక్షణతో శనివారం చిట్టిపైడమ్మ అమ్మవారి ఆలయం వద్ద యంత్రాలతో ప్రహరీ నిర్మాణం ప్రారంభించింది. విషయం తెలుసుకున్న సుమారు 2 వేల మంది గ్రామస్తులు వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు దేశంశెట్టి శంకరరావు, అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి ఆందోళన చేయడంతో పాటు నిర్మాణాన్ని అడ్డుకున్నారు. తమకు పునరావాసం కల్పించి, ప్యాకేజీ అందజేయాలని పోలీసులు, రెవెన్యూ, అధికారులు, ఏపీఐఐసీ, బ్రాండిక్స్‌ కంపెనీ ప్రతినిధులను డిమాండ్‌ చేశారు. అంతవరకూ ప్రహరీ నిర్మాణం చేపడితే అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. ఏమైనా సమస్యలుంటే స్థానిక తహసీల్దారు లేదా ఆర్డీవోకు చెప్పాలని, పనులు అడ్డుకోవడం సరికాదని ఈ సందర్భంగా పరవాడ డీఎస్పీ మోహనరావు నిర్వాసితులకు సూచించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేశంశెట్టి శంకరావు, గ్రామంలో అఖిల పక్ష నేతలు ప్రగడ రాజు, ప్రగడ జూనియర్‌ నాగేశ్వరరావు, శెట్టి నాగేశ్వరరావు, మాడెం సూరి అప్పారావు తదితర నేతలతో కంపెనీ ప్రతినిధులు చర్చలు జరిపారు. ఫలించకపోవడంతో అకస్మాత్తుగా పోలీసులు రంగంలోకి దిగి గ్రామస్తులను చెదరగొట్టారు. ముఖ్య నేతలను, మహిళలను, వృద్ధులను అరెస్టు చేసి కార్లు, మినీ బస్సుల్లో జిల్లాలో పరవాడ, సబ్బవరం తదితర పోలీస్టేషన్లకు తరలిస్తుండగా ఆందోళనకారులు అడ్డుకున్నారు. గ్రామంలో భారీగా మోహరించిన పోలీసులు గ్రామస్తులను తీవ్ర భయాందోళనకు గురిచేయడంతో పాటు ఐదు డ్రోన్‌ కెమెరాలతో సంఘటనను చిత్రీకరించారు. ఈ ఘటనలో పలువురు మహిళలు, యువతీ, యువకులు గాయపడ్డారు. ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. అనంతరం భారీ పొక్లెయిన్‌లతో గోడ నిర్మాణాన్ని చేపట్టారు. మిగులు భూముల్లో కొద్దిపాటి పంటలు, పశుగ్రాసం వేసుకుని బతుకుతున్నామని, ఇప్పుడు పంటలు నాశనం చేసి, ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టారని, న్యాయం అడిగితే తమపై దౌర్జన్యం చేశారని పలువురు గ్రామస్తులు శాపనార్థాలు పెడుతూ రోదించారు.

పోలీస్‌స్టేషన్‌ ముట్టడి

గ్రామస్తులు ఏకమై శనివారం సాయంత్రం అచ్యుతాపురం పోలీసు స్టేషన్‌ను ముట్టడించి, పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తమ నాయకులను ఎందుకు అరెస్టు చేశారు, ఎక్కడికి తరలించారో తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. అరెస్టు చేసిన తమ నాయకులను వెంటనే విడుదల చేసి తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరారు.

నమ్మి ఓటేస్తే తగిన శాస్తి జరిగింది

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే దుప్పితూరు గ్రామాన్ని తరలించి పునరావాసం, ఆర్థిక ప్యాకేజీ అందజేస్తామని నాయకులు నమ్మబలికారని, ఇప్పుడు చంద్రబాబు సర్కారు ముఖం చాటేసిందని గ్రామంలో పలువురు వాపోయారు. కూటమి నియోజకవర్గ స్థాయి నేతలు, స్థానిక ఎమ్మెల్యే తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చడంలో విఫలమయ్యారని, పునరావాసం వస్తుంది అనుకుంటే అక్రమ అరెస్టులు మిగిలాయన్నారు. విలువైన పంట భూములు కోల్పోయి, ఉపాధి కరువై దీనస్థితిలో బతకవలసిన పరిస్థితి దాపరించిందని పలువురు రోదించారు.

వైఎస్సార్‌సీపీ నేతల సంఘీభావం

సమాచారం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌, యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, వైఎస్సార్‌సీపీ మండల సీనియర్‌ నాయకుడు కోన బుజ్జి, జెడ్పీటీసీ లాలం రాము, జిల్లా కోఆప్షన్‌ సభ్యడు నర్మాల కుమార్‌, పిన్నమరాజు రవీంద్రరాజు, గంగిరెడ్డి రాము, పీలా నరసింగరావు, సియాద్రి బుజ్జి తదితరులు అచ్యుతాపురం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని అక్రమంగా అరెస్టు అయిన వారికి, నిర్వాసితులకు సంఘీభావం తెలిపారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్‌సీపీ తరఫున పోరాడతామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బొడ్డేడ ప్రసాద్‌ మాట్లాడుతూ నిర్వాసితులకు న్యాయంగా రావాల్సిన ప్యాకేజీ, పునరావాసం కల్పించి ఆదుకోవాలని కోరారు.

రైతుల పక్షాన నిలబడితే అక్రమ అరెస్టులా?

బ్రాండిక్స్‌ ప్రహరీ పనుల అడ్డగింత

పునరావాసం, ప్యాకేజీ అమలు చేయాలని డిమాండ్‌

వైఎస్సార్‌సీపీ, అఖిల పక్ష నాయకుల నిరసన

భారీగా మోహరించిన పోలీసులు

100 మంది ఆందోళనకారుల అరెస్ట్‌

కార్లు, బస్సుల్లో పలు పోలీస్‌స్టేషన్లకు తరలింపు

భయభ్రాంతులకు గురైన గ్రామస్తులు

బాధిత నిర్వాసితులు, వైఎస్సార్‌సీపీ నేతలను పరామర్శించిన బొడ్డేడ ప్రసాద్‌

పరవాడ: అచ్యుతాపురంలోని బ్రాండిక్స్‌ పరిశ్రమ రక్షణ గోడ నిర్మాణం విషయంలో రైతులకు అండగా నిలిచిన నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్‌ విమర్శించారు. పరవాడ పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న అచ్యుతాపురం మండల పార్టీ అధ్యక్షుడు దేశంశెట్టి శంకర్‌రావును శనివారం ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దుప్పి తూరు గ్రామ రైతుల సమస్యలపై గళమెత్తిన సుమారు 50 మంది వివిధ పార్టీల నాయకులను అరెస్టు చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. భూములిచ్చిన నిరుపేదలపై దాడులు చేయడం కూటమి ప్రభుత్వ నైజంగా కనిపిస్తోందని ధ్వజమెత్తారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పైల శ్రీనివాసరావు కూడా శంకరరావును పరామర్శించి అరెస్టులను ఖండించారు. ఈ కార్యక్రమంలో అచ్యుతాపురం జెడ్పీటీసీ లాలం రాంబాబు, కో జెడ్పీటీసీ నర్మల కుమార్‌, ఎంపీపీ కోన సంధ్య బుజ్జి, గంగిరెడ్డి, రాము, పరవాడ వైస్‌ ఎంపీపీ బంధం నాగేశ్వరరావు, పార్టీ మాజీ మండల అధ్యక్షుడు బొద్దపు చిన్నారావు, పైల అప్పలనాయుడు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement