కలెక్టర్‌పై కోర్టు దిక్కరణ కేసు నమోదు చేయాలి | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌పై కోర్టు దిక్కరణ కేసు నమోదు చేయాలి

Apr 24 2026 6:08 AM | Updated on Apr 24 2026 6:08 AM

● మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ ● అధికారులపై ఎస్పీకి ఫిర్యాదు

నర్సీపట్నం: కలెక్టర్‌, ఇతర అధికారులపై కోర్టు దిక్కరణ కేసు నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌, ఇరిగేషన్‌, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ అధికారులపై పార్టీ నాయకులతో కలిసి ఆయన గురువారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు సృష్టిక్షేత్రం పేరుతో నర్సీపట్నం పెద్ద చెరువులో 108 అడుగుల శివపార్వతుల విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల నష్టం జరుగుతుందని రైతులు తన దృష్టికి తీసుకొచ్చారని, వారి తరఫున తాను హైకోర్టును ఆశ్రయించానని చెప్పారు. పెద్ద చెరవు గట్టు బలోపేతం, సుందరీకరణ పనులకు సంబంధించి కార్యాచరణను కోర్టు ముందుంచాలని, చెరువులో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని కోర్టు ఆదేశించిందన్నారు. తదుపరి విచారణను జూన్‌ 17వ తేదీకి వాయిదా వేసిందని చెప్పారు. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ అధికారులు ఉపాధి కూలీలతో గట్టు వెడల్పు పనులు చేయిస్తున్నారని తెలిపారు. కోర్టు ఉత్తర్వులను ఉపాధి కూలీల దృష్టికి తీసుకువెళ్లకుండా వారందరిని మభ్యపెట్టి పనులు చేయిస్తున్నారని ఆరోపించారు.

కోర్టు ఆదేశాలను అధికారులు గౌరవించకుండా పనులు చేయించడం దారుణమన్నారు. ప్రత్యామ్నాయంగా వేరే చోట ఉపాధి పనులు కల్పించకుండా చెరువులో పనులు చేయించడం కోర్టు ధిక్కరణ అవుతుందన్నారు. కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌ ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిన కలెక్టర్‌, ఇరిగేషన్‌ ఎస్‌ఈ, డీఈ, ఆర్డీవో, తహసీల్దార్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు. ఎస్పీ నిర్ణయం తరువాత అధికారుల తీరుపై కోర్టు వారిని ఆశ్రయించనున్నట్టు మాజీ ఎమ్మెల్యే గణేష్‌ తెలిపారు. ఆయన వెంట మాజీ మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ కోనేటి రామకృష్ణ, పార్టీ లీగల్‌ సెల్‌ ప్రతినిధి మాకిరెడ్డి బుల్లిదొర, పార్టీ టౌన్‌ అధ్యక్షుడు ఏకా శివ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement