నక్కపల్లి: బీసీలపై సీఎం చంద్రబాబునాయుడిది సవతి తల్లి ప్రేమ అని వైఎస్సార్‌సీపీ జిల్లాప్రధాన కార్యదర్శి శీరం నర్సింహమూర్తి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గొర్ల నర్సింహమూర్తి అన్నారు. గురువారం వారు నక్కపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ 50 ఏళ్లు నిండిన బీసీలందరికీ పింఛన్ ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని, ఆయన మాటలు నమ్మి బీసీలంతా ఓటేశారని చెప్పారు. గెలిచి రెండేళ్లపూర్తవుతున్నప్పటికీ ఒక్క బీసీకి కొత్తగా పింఛన్ ఇవ్వలేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కొత్తగా ఒక్క వృధ్యాప్య, వితంతు పింఛన్ కూడా ఇవ్వలేదన్నారు.కేవలం అధికారంలోకి రావడం కోసమే సూపర్‌సిక్స్ పేరుతో బూటకపు హామీలు ఇచ్చారని ఆరోపించారు. బీసీలపై మొదటినుంచి చంద్రబాబు వివక్ష చూపుతున్నారని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకోసం వాడుకున్నారని చెప్పారు. రెడ్‌బుక్ పేరుతో బీసీలు, ఎస్సీలపై రాజకీయ దాడులు, కేసులు పెట్టి వేధించడం చేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలోనే బీసీలకు సముచిత స్థానం లభించినట్టు చెప్పారు. బీసీలను డిప్యూటీ ముఖ్యమంత్రులను చేసిన ఘనత జగన్ మోహన్‌రెడ్డిదేనని తెలిపారు. జగనన్న ప్రభుత్వంలోనే 50 బీసీ ఉపకులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి పలువురు నాయకులకు చైర్మన్, డైరెక్టర్ పదవుల్లో నియమించి, రాజరకీయంగా తగిన ప్రాధాన్యత కల్పించారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ల సదుపాయం కల్పించి పోటీ చేసే అవకాశం కల్పించిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు.బీసీలంటే వెనుకబడినతరగతుల వారు కాదు, పార్టీకి బ్యాక్‌బోన్ లాంటివారని గుర్తించిన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. కూటమిప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 50 ఏళ్లు వయసు నిండిన వారికి పింఛన్లు ఇవ్వాలన్నారు. ఈనెల 26న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అనంతపురంలో రాష్ట్రస్థాయి బీసీల సదస్సు జరుగుతుందని బీసీసెల్ అధ్యక్షుడు నర్సింహమూర్తి తెలిపారు. ప్రభుత్వం బీసీలపై చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేసేందుకు ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నట్టు చెప్పారు. బీసీలంతా హాజరై ఈ సదస్సును విజయవంతం చేయాలని కోరారు.
జిల్లా పార్టీ ప్రధాన కారదర్శి, బీసీ సెల్ అధ్యక్షపదవులను నక్కపల్లి మండలానికి కేటాయించేందుకు కృషి చేసిన మాజీ మంత్రి అమర్ నాథ్, వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ కన్నబాబు, సమన్వయకర్త కంబాల జోగులు,పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌లకు కృతజ్ఙతలు తెలిపారు. ఈసమావేశంలో వైఎస్సార్‌ిసీసీ రాష్ట్రప్రచార విభాగం సహాయ కార్యదర్శి లొడగల చంద్రరావు, రాష్ట్ర బూత్ విభాగం సహాయకార్యదర్శి గొర్ల బాబూరావు, మండల ప్రధాన కార్యదర్శి ఎరిపల్లి నాగేశు, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు యలమంలిచి తాతబాబు, నాయకులు ప్రసాదుల శ్రీను, సూరిసత్తిబాబు, పల్లాచినబ్బాయి తదితరులు పాల్గొన్నారు.


