యలమంచిలి రూరల్ : పట్టణంలోని కోర్టుపేట భాష్యం స్కూల్‌లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు బుధవారం అదృశ్యమయ్యారు. ఈ పాఠశాలలో 6వ తరగతి విద్యార్థులు కొలగాని బాలు, ప్రగడ నితిన్‌లు మధ్యాహ్నం 12.40 గంటలకు స్కూల్ విడిచి పెట్టిన తర్వాత ఇంటికి వెళ్లలేదు. ఎస్.రాయవరం మండలం వేమగిరికి చెందిన కొలగాని బాలు రోజూ భాష్యం స్కూల్ బస్సులో పాఠశాలకు వచ్చి వెళ్తుంటాడు. మరో విద్యార్థి ప్రగడ నితిన్ యలమంచిలి పట్టణంలోని పాతవీధి వీరభద్రస్వామి ఆలయ ప్రాంతానికి చెందిన వాడు. అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులూ స్నేహితులు. వీరు కనిపించకపోవడంతో పాఠశాల నిర్వాహకులు తల్లిదండ్రులకు సమాచారమిచ్చారని పట్టణ ఎస్‌ఐ కె.సావిత్రి తెలిపారు. కుటుంబసభ్యులు ఇద్దరు విద్యార్థుల ఆచూకీ కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో బుధవారం సాయంత్రం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ చెప్పారు. విద్యార్థులు ఎందుకు అదృశ్యమయ్యారో కారణం తెలియలేదు. అదృశ్యమైన విద్యార్థుల ఆచూకీ తెలిస్తే 9440796103 నంబరుకు సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు.


