పండగ పూట రైతులు, కార్మికులకు పస్తులు
చోడవరం : పండగ పూట కూడా పస్తులు పెట్టి ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని చెరకు రైతు, కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. చెరకు రైతులకు వెంటనే బకాయిలు చెల్లించాలని కోరుతూ రైతు, కార్మిక సంఘాల నాయకులు దీక్షా శిబిరం వద్ద అంబేడ్కర్ చిత్రపటానికి వినతిపత్రం ఇచ్చి ప్రభుత్వం తీరుపై నిరసన తెలిపారు. ఫ్యాక్టరీ మెయిన్‌గేటు వద్ద ఏర్పాటు చేసిన నిరసన రిలే దీక్ష శిబిరం గురువారం 12వ రోజుకి చేరింది. సీపీఐ, రైతుకూలీ సంఘం, ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ, ఫ్యాక్టరీ కార్మిక సంఘాలు, ఏపీ చెరకు రైతు సంఘం, వ్యవసాయ కూలీ సంఘం, ఏపీ రైతు సంఘం ఈ శిబిరంలో పాల్గొని నిరసన తెలిపారు. సంక్రాంతి పండగ లోగా రైతులకు గతేడాది చెరకు బకాయిలు చెల్లించాలని కోరినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి రైతులు, కార్మికుల ఉసురు పోసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీని మూసివేసే ఆలోచన విరమించుకొని క్రషింగ్ ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేశారు. కార్మికులకు జీతాలు లేక ఆకలిలో కుటుంబాలు పస్తులండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో సుగర్ ప్యాక్టరీ కార్మిక సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాయి సూరిబాబు, శరగడం రామునాయుడు, జిల్లా వ్యవసాయ కూలీ సంఘం అధ్యక్షుడు కోన మోహన్‌రావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, ఏపీ చెరకు రైతు సంఘం అధ్యక్షుడు కర్రి అప్పారావు, రైతు సంఘం, ఫ్యాక్టరీ పరిరక్షణ శానాపతి సత్యారావు, ఏడువాక శ్రీను, వనం సూర్యనారాయణ, పోతల శ్రీరాములు ,సిఐటియూ నాయకుడు ఎస్వీనాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయనబాబు,నాగిరెడ్డి సత్యనారాయణ, ఆర్.దేముడునాయుడు పాల్గొన్నారు.


