పందెం బరిలో కూటమి
ప్రజల్ని చైతన్యవంతులను చేయాల్సిన ప్రజా ప్రతినిధులు జూదాలకు, మద్యానికి బానిసలుగా చేస్తూ ప్రజలపై విషం కక్కుతున్నారు. కోడి పందాలు, జూదాలు, మద్యంతో పాటు అశ్లీల నృత్యాలకు స్టేజీలు ఏర్పాటు చేసి మరీ అమాయక ప్రజల్ని ఆకట్టుకోవడానికి పాట్లు పడుతున్నారు. కూటమి నేతల అడ్డాల్లో సంక్రాంతి మూడు రోజుల్లో రూ.కోట్లల్లో చేతులు మారనున్నాయి. వారం రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేస్తున్నా పోలీసులు చూసీచూడనట్లుగా ఆ వైపే వెళ్లకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.
చోడిపల్లి పంచాయతీలో
జూదాలకు సిద్ధం చేసిన టెంట్లు, ఎదురుగా స్టేజి
సాక్షి, అనకాపల్లి/అచ్యుతాపురం రూరల్ :
కూటమి ప్రభుత్వం ఏర్పడి మండలంలో టీడీపీ, జనసేన వేర్వేరుగా విడిపోయి ఒక్కో పార్టీ ఒక్కో మండలాన్ని పంచుకుని అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించడంలో నిమగ్నమయ్యారు. జనసేన పార్టీ స్థానిక ఎమ్మెల్యే సోదరుల అనుచరులు, నాయకులు రాంబిల్లి మండలం వెంకటాపురం కేంద్రంగా బరి ఏర్పాటు చేశారు. స్థానిక టీడీపీ ఇన్‌ఛార్జి అనుచరులు, టీడీపీ నాయకులు అచ్యుతాపురం మండలం చోడపల్లి పంచాయతీలో మరో బరి ఏర్పాటు చేసుకుని అక్రమ ధనార్జనకు సామాన్య ప్రజల్ని బలిపశువుల్ని చేస్తున్నారు.
అనధికారిక లేఅవుట్‌లో...
అచ్యుతాపురంలో చోడపల్లి పంచాయతీలో అనధికారంగా వేసిన లే–అవుట్‌లో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించేందుకు కూటమి నాయకులు ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా చోడపల్లిలో ఏర్పాటు లే–అవుట్‌కు ఎటువంటి అనుమతులు లేకుండా రహదారులు ఏర్పాటు చేసి ప్లాట్లుగా విభజించి అమ్మకాలు చేసుకుంటూ పంచాయతీ ఆదాయానికి గండికొడుతున్నారు. ఇప్పుడు అదే లే–అవుట్‌లో కోడి పందాలు, గుల్లాట బల్లలు, పేకాట, మద్యం బెల్టు షాపులకు కూటమి నాయకులు బరి సిద్ధం చేశారు. ఒక వైపు పోలీసులు రాష్ట్రంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు అనుమతులు లేవని హెచ్చరిస్తున్నప్పటికీ గ్రామ స్థాయి నాయకులు మాత్రం అధికారుల మాటలు బేఖాతరు చేస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ విషయమై చోడపల్లి పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌రావును సంప్రదించగా చోడిపల్లిలో ఏర్పాటు చేసిన బరి అనధికారంగా వేసిన లే–అవుట్‌లోనే ఉందని, ఆ లే–అవుట్‌కి పంచాయతీ అనుమతులు లేవని, లే–అవుట్ సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్లు మాకు అందజేయలేదంటూ తెలియజేశారు.
80 ఎకరాల లేఅవుట్‌లో భారీ బరి..!
రాంబిల్లి మండలంలో వెంకటాపురం గ్రామం సమీపంలో 80 ఎకరాల ఓ రియల్ ఎస్టేట్ లేఅవుట్‌లో జనసేన ఎమ్మెల్యే సోదరుల కనుసన్నుల్లోనే భారీఎత్తున జూద క్రీడల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. కోడి పందాలతో పాటు లాటరీ బల్ల, గుండాట వంటి జూద క్రీడలను ఏర్పాటు చేస్తున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ జూద క్రీడల్లో 16 లాటరీ బల్లలను ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. వీటిలో అచ్యుతాపురానికి చెందిన జనసేన పార్టీకి చెందిన నేతలకు –4, రాంబిల్లి–3, యలమంచిలి–4, మునగపాక–5 లాటరీ బల్లలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో బల్లను ఏర్పాటు చేసినందుకు ముందస్తు మామ్మూళ్లు రూ.5 లక్షలు చొప్పున చెల్లించినట్లు తెలిసింది.
‘బరి’తెగిస్తే చర్యలు తప్పవు
ప్రశాంతమైన వాతావరణంలో గ్రామీణ స్థాయి నుంచి సంక్రాంతి వేడుకలను నిర్వహించుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితంలో నూతన కాంతులు, ఆనందాలు నింపేలా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ పండగ నిర్వహించుకోవాలి. కోడిపందాలు, గుళ్లాటలు, ఇతర అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించినట్టయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పండగ ముసుగులో జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై 24/7 డ్రోన్ కెమెరాల ద్వారా పోలీస్ పర్యవేక్షణ ఉంటుంది.గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో నిరంతరం డ్రోన్ కెమెరా ద్వారా జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో పర్యవేక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. కోడిపందాలకు కత్తుల కట్టడం, భారీ ఎత్తున బెట్టింగ్ నిర్వహించడం, పేకాట, గుండాట, కోసు వంటి జూద క్రీడలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సంప్రదాయం పేరిట జీవహింసకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. ఇప్పటికే రౌడీషీట్లు తెరిచేందుకు కూడా వెనుకాడబోము. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందించాలి.ఎక్కడైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్టతే డయల్ 100/112కు, స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలి. అటువంటి వ్యక్తుల పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుంది.
– తుహిన్ సిన్హా, ఎస్పీ, అనకాపల్లి జిల్లా
చోడపల్లిలో
అనధికార లేఅవుట్‌లో టీడీపీ బరి
పందెం బరిలో కూటమి
పందెం బరిలో కూటమి
పందెం బరిలో కూటమి


