విద్యుత్ చార్జీలపై ప్రజాభిప్రాయ సేకరణ
అనకాపల్లి : విద్యుత్ చార్జీల (టారిఫ్)పై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఈ నెల 20 నుంచి బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు జిల్లా ఏపీఈపీడీసీఎల్ పర్యవేక్షక ఇంజినీరు గొప్పు ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీఈఆర్‌సీ చైర్మన్ పి.వి.ఆర్.రెడ్డి గారి ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు జరిగే ప్రజాభిప్రాయ సేకరణ 10.30 గంటల నుంచి ఒంటిగంట వరకు (వ్యక్తిగతంగా), రెండు గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు (వీడియో కాన్ఫరెన్స్ ద్వారా) జరుగుతాయన్నారు. ఏపీఆర్‌సీ అధికారులతో పాటు ఆంధ్రప్రదేశ్ ఇంధనశాఖ, ఏపీట్రాన్స్‌కో, ఏపీజెన్‌కో, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్‌పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రతిరోజు మూడు విద్యుత్ పంపిణీ సంస్థల టారిఫ్ ఫైలింగ్‌కు సంబంధించిన ప్రజాభిప్రాయాలను స్వీకరిస్తారని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో అనకాపల్లి గవరపాలెం పర్యవేక్షక్ ఇంజినీరు కార్యాలయం, కార్యనిర్వాహక ఇంజినీరు కార్యాలయం, కశింకోట కార్యనిర్వాహక ఇంజినీరు కార్యాలయం, నర్సీపట్నం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ముందుగానే పేర్లు నమోదు చేసుకోవాలని పేర్లు నమోదు చేసుకోనివారు కూడా విద్యుత్ నియంత్రణ మండలి అనుమతితో అభిప్రాయాలు తెలియచేయవచ్చన్నారు. ప్రజాభిప్రాయ సేకరణను ప్రజలు వీక్షించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు తెలిపారు. జిల్లా పర్యవేక్షక్ ఇంజినీరు కార్యాలయం సెల్, 9440816377, కార్యనిర్వాహక ఇంజినీర్ కశింకోట సెల్. 9440816352, కార్యనిర్వాహక ఇంజినీరు కార్యాలయం, నర్సీపట్నం 9491049790 నంబర్లు ద్వారా మాట్లాడవచ్చన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ప్రత్యక్ష ప్రసారానికి httpr://www. eliveevents.com / aperc2026ను సంప్రదించాలన్నారు.


