ఉమ్మడి జిల్లాకు 36 స్వచ్ఛ రథాలు
నాతవరం : ఉమ్మడి జిల్లాలో ఈనెల 17వ తేదీన 36 స్వచ్ఛ రథాలు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా పరిషత్ సీఈవో నారాయణమూర్తి అన్నారు. మండల పరిషత్ కార్యాలయాన్ని ఆయన మంగళవారం సాయంత్రం తనిఖీ చేశారు. మండల పరిషత్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. తర్వాత జెడ్పీటీసీ కాపారపు అప్పలనర్స, ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి ఆయన్ని కలిసి మండలంలో గల ప్రధాన సమస్యలను వివరించారు,. ఇంతవరకు చేసిన పలు అభివృద్ధి పనులకు సకాలంలో బిల్లులు రాక ఇబ్బందులు ఉన్నాయన్నారు. అదే విధంగా మండలంలో గల ప్రధాన సమస్యలతో సిబ్బంది కొరతపై ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాల ప్రకారం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద అనకాపల్లి, రావికమతం, అచ్చుతాపురం మండలాలను ఎంపిక చేసి స్వచ్ఛ రథాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఆయా మండలాల్లో పని తీరు అధారంగా ఉమ్మడి జిల్లాలో మండలానికి ఒక స్వచ్ఛ రథం మంజూరు చేశామన్నారు. స్వచ్ఛ రథాలు నడపడానికి ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఒక వ్యక్తిని నియమించామన్నారు. ఆ వ్యక్తికి మండల పరిషత్ 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి నెలకు రూ.25 వేలు తక్కువ లేకుండా ఏడాదికి రూ. 3 లక్షలకు పైగా ఇవ్వడం జరుగుతుందన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకోని తాగునీటి ఎద్దడి లేకుండా గ్రామాల్లో తాగునీరు బోర్లు ముందస్తుగా మరమత్తులు చేస్తున్నామన్నారు. ఉమ్మడి జిల్లాలో పెద్ద తాగునీటి పథకాలు 47 ఉన్నాయని వాటి నిర్వహణకు ఏడాదికి రూ.20 కోట్లు 15వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. గ్రామాల్లో లింకు రోడ్లు అభివృద్ధి చేయుట తదితర పనులు చేస్తున్నామన్నారు. నాతవరం మండలంలో జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ తమ దృష్టికి తీసుకువచ్చిన ప్రధాన సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.


