క్వారీ లారీల లోడ్లతో రోడ్లు విధ్వంసం
రోలుగుంట: మండలంలో అక్రమ భారీ లోడు వాహనాలతో ఘాటీరోడ్లుగా మారుతున్న తారురోడ్ల దుస్థితిని నిరసిస్తూ సీపీఎం నాయకులు మంగళవారం చింతపల్లి –బుచ్చింపేట మార్గంలో ధర్నా నిర్వహించారు. దీనికి సారధ్యం వహించిన కె.గోవింద మాట్లాడుతూ 40 గ్రామాలకు ప్రయోజనకరంగా ఉండేందుకు గాను చింతపల్లి రోడ్డు నుంచి బుచ్చింపేట వయా వడ్డిప తారురోడ్డు నిర్మించారన్నారు. ఈ మార్గంలో అక్రమ క్వారీ నిర్వాహకులు భారీ బండరాళ్లు లోడు రవాణా చేయడం వల్ల తారురోడ్డు మట్టిరోడ్డుగా మారిపోయిందని వాపోయారు. దారి పొడవునా భారీ గోతులు ఉన్నాయని, రోజుకి వంద లారీల వరకూ రవాణా చేయడం వల్ల ఇరుకు రోడ్డులో వాహనచోదకులకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఈ మార్గంలో గోతుల కుదుపుల్లో గర్భిణుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు. ఈ సమస్యపై ఆర్డీవో, విజెలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమన్నారు. దుమ్ము, ధూళితో పులువురు శ్వాసకోశ వ్యాధులు బారిన పడుతున్నారని వాపోయారు. ఈ మార్గంలో క్వారీల నుంచి పూర్తిస్థాయిలో నల్లరాయి రవాణా అరికట్టి, దెబ్బతిన్న చోట బాగు చేయాలని డిమాండు చేశారు. ధర్నాలో పాంగి భాస్కరరావు, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.


