
కలెక్టర్ తీరుపై దళిత రైతుల ఆవేదన
నర్సీపట్నం: కలెక్టర్ విజయ కృష్ణన్ తీరుపై మాకవరపాలెం మండలం జి.కోడూరు క్వారీ బాధిత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. క్వారీ అనుమతులు రద్దు చేయాలని బాధిత రైతులు ఎనిమిది రోజులుగా ఆర్డీవో కార్యాలయం వద్ద నిరాహారదీక్ష చేస్తున్నారు. బుధవారం కలెక్టర్ నర్సీపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యను కలెక్టర్‌కు తెలియజేసేందుకు ప్లకార్డులతో నినాదాలు చేశారు. అయినా కలెక్టర్ ఆగకుండా వెళ్లిపోయారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర నాయకులు బొట్టా నాగరాజు, దళిత నాయకులు మట్ల చంటి, కాంగ్రెస్ జిల్లా నాయకులు బొంతు రమణ మాట్లాడుతూ కలెక్టర్ రైతుల సమస్యలను పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేసినప్పటికీ కలెక్టర్ పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో దళితుల పట్ల చులకన భావం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. జిల్లాలో ఏమి జరుగుతుందో కలెక్టర్‌కు తెలియకపోడం దారుణమన్నారు.