
విశాఖలో విద్యుదాఘాతంతో కొత్తకోట వాసి మృతి
రావికమతం: విశాఖ నగరం కంచరపాలెంలో కరెంటు షాక్‌తో శుక్రవారం ఉదయం 8 గంటలకు రావికమతం మండలం కొత్తకోట గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాలివి. రావికమతం మండలం కొత్తకోట గ్రామానికి చెందిన భీమరాతి రాజుబాబు(లేటు), చంద్రమ్మ రెండో కుమారుడు రమణ(41) పది సంవత్సరాల క్రితం కంచరపాలెంలో భార్య సత్యవతితో కలిసి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం నుంచి కంచరపాలెంలో ఐటీఐ జంక్షన్‌లోని శ్రీకుంచమాంబ వాటర్ వాస్ సర్వీసింగ్ పాయింట్‌లో పని చేస్తున్నారు. ఎప్పటిలాగే ఉదయం సర్వీసింగ్ సెంటర్‌కు వెళ్లిన రమణ వాటర్ మోటార్ స్వీచ్ ఆన్ చేస్తుండగా కరెంటు షాక్‌కు గురై మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. దీనిపై కంచరపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మృతుడికి భార్య సత్యవతి, కుమారులు జశ్వంత్, సుశ్చిత్ ఉన్నారు. జశ్వంత్ ఐటీఐ, సుశ్చిత్ ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కొత్తకోటకు తరిలించామని పోలీసులు తెలిపారు. రమణ ఆకాల మరణంతో కొత్తకోటలో విషాదఛాయలు అలముకున్నాయి.