
బుచ్చెయ్యపేట మండల టీడీపీలో వర్గభేదాలు
బుచ్చెయ్యపేట: వృద్ధుల పింఛన్ల పంపిణీలో టీడీపీ నాయకుల మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. బుచ్చెయ్యపేట మండలంలో ఉన్న మేజర్ పంచాయతీ వడ్డాదికి చెందిన రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజుల మధ్య కొద్ది కాలంగా వర్గ విభేదాలు నడుస్తున్నాయి. శుక్రవారం స్పౌజ్ పింఛన్ల పంపిణీలో మరోసారి రెండు వర్గాల విభేదాలు బయటపడ్డాయి. మండలంలో ఉన్న 35 పంచాయతీలకు 196 స్పౌజ్ పింఛన్‌లు మంజూరు కాగా.. వడ్డాదికి 27 పింఛన్‌లు మంజూరయ్యాయి. లబ్ధిదారులకు మండల కేంద్రం బుచ్చెయ్యపేటలో ఎమ్మెల్యే రాజు చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేయడానికి ఎంపీడీవో కార్యాలయం వద్ద వేదిక ఏర్పాటు చేశారు. ఒకటో తేదీ ఉదయం 9 గంటలకే పింఛన్లు పంపిణీ చేస్తారనడంతో ఉదయం 8 గంటలకే వడ్డాది పింఛన్‌దార్లు చేరుకున్నారు. వడ్డాది టౌన్ టీడీపీ అధ్యక్షుడు దొండా నరేష్ తన సొంత నిధులతో 22 మంది వృద్ధులను బుచ్చెయ్యపేటలో ఎమ్మెల్యే రాజు పింఛన్‌ల పంపిణీ చేసే వేదిక వద్దకు ఆటోలపై తీసుకొచ్చారు. ఎమ్మెల్యే రాజు వచ్చి వేదికపై ముగ్గురికి పింఛన్లు ఇచ్చి వెళ్లిపోయారు. మిగతా గ్రామాల నాయకులు, అధికారులు కలిసి లబ్ధిదారులకు పింఛన్ నగదు బట్వాడా అక్కడే చేశారు. వడ్డాదికి చెందిన వృద్ధులకు మాత్రం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు పింఛన్‌లు పంపిణీ చేయలేదు. వారికి వడ్డాది పంచాయతీ వద్ద పింఛన్ నగదు ఇస్తామని తెలిపారు. అక్కడే ఉన్న తాతయ్య వర్గానికి చెందిన నాయకులు దొండా నరేష్, తలారి శంకర్, అక్కిరెడ్డి కనక, గురుమూర్తి, వెలుగుల నాగేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రం బుచ్చెయ్యపేటలో కొత్తవారికి పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పి, ఇప్పుడు వడ్డాదిలో ఇస్తామనడంలో కారణమేమిటని ఎంపీడీవో భానోజీరావు, పంచాయతీ సెక్రటరీ ఈశ్వరరావుపై మండిపడ్డారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. గ్రూపు రాజకీయాలకు తాము బలైపోతామని గ్రహించిన అధికారులు చేసేది లేక అక్కడే వడ్డాది లబ్ధిదారులకు కూడా పింఛన్ నగదు బట్వాడా చేశారు. కొత్త పింఛన్ల పంపిణీకి ఎమ్మెల్యే రాజు నుంచి తాతయ్యబాబుకు కబురు రాకపోవడంపై పలువురు టీడీపీ నాయకులు మండిపడుతున్నారు.
కొత్త పింఛన్ పంపిణీలో మరోసారి బహిర్గతం
ఎమ్మెల్యే రాజు V/S టీడీపీ జిల్లా అధ్యక్షుడు తాతయ్యబాబు